Share News

వెండి రీసైక్లింగ్‌లోకి ఎంఎంటీసీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:56 AM

వెండికి డిమాండ్‌ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సరఫరా-డిమాండ్‌ మధ్య తీవ్ర అంతరం నిరోధించడం లక్ష్యంగా ఎంఎంటీసీ-పీఏఎంపీ వెండి రీసైక్లింగ్‌ చేపట్టాలని నిర్ణయించాయి.

వెండి రీసైక్లింగ్‌లోకి ఎంఎంటీసీ

న్యూఢిల్లీ: వెండికి డిమాండ్‌ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సరఫరా-డిమాండ్‌ మధ్య తీవ్ర అంతరం నిరోధించడం లక్ష్యంగా ఎంఎంటీసీ-పీఏఎంపీ వెండి రీసైక్లింగ్‌ చేపట్టాలని నిర్ణయించాయి. మరో మూడు నెలల్లో ప్రయోగాత్మక ప్రాతిపదికన తమ స్టోర్‌లో వెండి రీ సైక్లింగ్‌ ప్రారంభించనున్నామని కంపెనీ ఎండీ, సీఈఓ సమిత్‌ గుహ తెలిపారు. డిమాండు పెరుగుతున్నప్పటికీ ప్రపంచ స్థాయిలో గనుల ఉత్పాదక సామర్థ్యం పెరిగే ఆస్కారం ఏమీ కనిపించని కారణంగా వెండి రీ సైక్లింగ్‌కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి వాతావరణంలో రీసైకిల్‌ చేసిన వెండి సరఫరా లోటును తీర్చడంలో కీలకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ గృహస్థుల వద్ద 25,000 టన్నుల బంగారం, దానికి పది రెట్లు అధికంగా వెండి నిల్వలున్నాయని అంచనా అని చెప్పారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో సోర్ల సంఖ్య రెట్టింపు చేయాలని భావిస్తున్నట్టు గుహ తెలిపారు. వెండి రీ సైక్లింగ్‌ ప్రారంభించడానికి ముందు స్టోర్లలోని పరికరాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నదని, వెండిని ఒక లోహంగా గుర్తించేలా వాటిని సిద్ధం చేయాల్సి ఉన్నదని చెప్పారు. అలాగే సిబ్బందికి కూడా కొంత శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు.

పెట్టుబడికి వెండి సానుకూలం: వెండి తక్కువ స్థాయిలో పెట్టుబడులకు అనుకూల సాధనమని గుహ అన్నారు. గత ఏడాది కాలంలో బంగారం ధర 75ు పెరిగితే వెండి, ప్లాటినం 130-140ు పెరిగాయని చెప్పారు. గత 12 నెలలుగా బంగారంతో పోల్చితే వెండి రెట్టింపు రాబడిని అందించిందన్నారు. బంగారం ర్యాలీని మిస్‌ అయిన ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిని అనుకూలమైన పెట్టుబడిగా భావిస్తున్నారని చెప్పారు. తక్కువ మొత్తంలో పెట్టుబడికి వెండి సానుకూలం కావడమే ఇందుకు కారణమని గుహ తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 04:56 AM