వాహనానికి తిప్పలే..!
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:38 AM
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బలమైన పనితీరును కనబరిచిన దేశీయ వాహన పరిశ్రమ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ప్రతికూల పర్యవసానాలు ఎదుర్కొనే అవకాశం ఉందని భారత....
పశ్చిమాసియా యుద్ధంతో ప్రతికూల పర్యవసానాలు..
స్వల్పకాలంలో ఆటో ఇండస్ట్రీకి సవాలే
గిరాకీపై పరోక్ష ప్రభావం
ఆందోళన వ్యక్తం చేసిన సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బలమైన పనితీరును కనబరిచిన దేశీయ వాహన పరిశ్రమ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ప్రతికూల పర్యవసానాలు ఎదుర్కొనే అవకాశం ఉందని భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్) అధ్యక్షుడు శైలేష్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఇండస్ట్రీకి సవాలుగా పరిణమించనుందని, వాహన గిరాకీపై పరోక్ష ప్రభావం చూపవచ్చని ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ‘‘సరఫరా అవరోధాల కారణంగా వాహనాల పెయింటింగ్, హీట్ ట్రీట్‌మెంట్ ప్రాసెస్‌లో ఉపయోగించే కీలక రసాయనాలైన ప్రోపేన్, ఎథిలీన్ కొరత ఏర్పడింది. అంతేకాదు, కొన్ని పెట్రోకెమికల్స్, ఇతర కీలక కమోడిటీల కొరత కూడా మొదలైంది. అంతర్జాతీయ సరుకు రవాణా పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగింది. హోర్ముజ్ జలసంధి మూసివేతతో దారి మళ్లింపు, సరఫరా జాప్యం కారణంగా నౌకల ద్వారా సరుకు రవాణా వ్యయం పెరుగుతోంద’’ని శైలేష్ చంద్ర అన్నారు. ప్రస్తుతం వాహన ఉత్పతికి ఎలాంటి అవాంతరాలు లేకపోయినప్పటికీ భవిష్యత్ అస్థిరంగా మారిందన్నారు. విడిభాగాల సరఫరా విషయానికొస్తే, ఇదివరకు ప్రతి మూడు రోజులకోసారి డెలివరీ జరిగేదని..ఇప్పుడు కాస్త జాప్యమవుతోందన్నారు. దాంతో కొంత ఒత్తిడి పెరిగిందని, మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలన్నారు.
వాహన ధరలు మరింత పెంపు?
ప్రస్తుత సమస్యకు పరిష్కారం, ఏమేం చర్యలు చేపట్టవచ్చనే విషయాలపై వాహన పరిశ్రమ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని శైలేష్ చంద్ర తెలిపారు. ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ తమ పరిశ్రమ వాహన సరఫరాను కొనసాగిస్తోందని.. అవాంతరాలున్న సందర్భాల్లో కొన్ని కంపెనీలు ఎయిర్‌కార్గో ద్వారా సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధం మరింత కాలం కొనసాగితే, పరిస్థితులు అధ్వానంగా మారవచ్చని.. ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగితే, వాహన ధరలను మరింత పెంచాల్సి రావచ్చన్నారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనే విషయంపై వచ్చే 4-5 వారాల్లో స్పష్టత రావచ్చన్నారు. అప్పుడు గానీ వాహన ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇందుకు తోడు ఇంధన ధరలు కూడా పెరిగితే వాహన గిరాకీపై ప్రభావం చూపవచ్చన్నారు. ప్రస్తుతానికైతే కస్టమర్ల ఎంక్వైరీలు జోరుగానే ఉన్నప్పటికీ, వారి కొనుగోళ్లు మాత్రం కొంత జాప్యమవుతున్నట్లు డీలర్ల నుంచి సమాచారం అందుతోందన్నారు. ఇంధన ధరలు పెరిగితే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగవచ్చని శైలేష్ చంద్ర అభిప్రాయపడ్డారు.
2.83 కోట్ల యూనిట్ల టోకు విక్రయాలు
మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో వాహనాల టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 10.4 శాతం పెరిగి 2.83 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ వెల్లడించింది. ప్యాసింజర్, కమర్షియల్, ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల అమ్మకాలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరిగాయని తెలిపింది. గత సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని తగ్గించడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాహన టోకు విక్రయాలు 2.56 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, 2025-26లో భారత్ నుంచి మొత్తం వాహన ఎగుమతులు 24 శాతం వృద్ధితో 66,47,685 యూనిట్లకు పెరిగాయి. 2024-25లో ఎగుమతులు 53,62,884 యూనిట్లుగా నమోదయ్యాయి. మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)పై సానుకూల దృక్పథంతోనే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే వాహనాల తయారీ, సరఫరా, గిరాకీపై గణనీయ ప్రభావం చూపవచ్చని సియామ్ పేర్కొంది.