Stock Market Crash: సుంకంపం!
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:58 AM
దలాల్ స్ట్రీట్ సుంకాల భయంతో కంపించింది. గురువారం ఒక దశలో సెన్సెక్స్ 851 పాయింట్లు పతనమై 84,110.10 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.
సెన్సెక్స్ 780 పాయింట్లు డౌన్
మళ్లీ 26,000 కింది స్థాయికి నిఫ్టీ
స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు విలవిల
రూ.7.74 లక్షల కోట్ల సంపద ఉఫ్
4 రోజులుగా నష్టాల్లోనే సూచీలు
ముంబై: దలాల్ స్ట్రీట్ సుంకాల భయంతో కంపించింది. గురువారం ఒక దశలో సెన్సెక్స్ 851 పాయింట్లు పతనమై 84,110.10 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263.90 పాయింట్లు క్షీణించి 25,876.85 వద్ద ముగిసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ సహా ఇతర దేశాలపై 500 శాతం సుంకాలు విధించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపడంతో పాటు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, ఐటీ రంగ షేర్లలో పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారని మార్కెట్ నిపుణులు తెలిపారు. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 26 నష్టపోయాయి.
నాలుగు సెషన్లలో రూ.9.19 లక్షల కోట్లు ఆవిరి: అమ్మకాల హోరులో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.74 లక్షల కోట్లు తగ్గి రూ.472.20 లక్షల కోట్లకు (5.25 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా గత నాలుగు రోజులుగా మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. గడిచిన 4 సెషన్లలో సెన్సెక్స్ 1,581.05 పాయింట్లు (1.84 శాతం), నిఫ్టీ 451.7 పాయింట్లు (1.71 శాతం) పతనమవగా.. మార్కెట్ వర్గాల సంపద రూ.9.19 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.
రిలయన్స్‌కు రూ.1.65 లక్షల కోట్ల నష్టం: గత నాలుగు రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) షేరు దాదాపు 8 శాతం నష్టపోగా.. కంపెనీ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. గురువారం సెషన్‌లో ఆర్‌ఐఎల్ షేరు ధర 2.25 శాతం క్షీణించి రూ.1,470.30 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ నాలుగు సెషన్లలో రూ.1,65,299.15 కోట్లు తగ్గి రూ.19,89,679.45 కోట్లకు పరిమితమైంది.
రూపీ డౌన్.. క్రూడ్ అప్: ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి రూ.89.90 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం ఇందుకు కారణం. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒక దశలో 0.75 శాతం పెరిగి 60.42 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
నెలాఖరులో యాక్సియం గ్యాస్ ఐపీఓ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆటో ఎల్‌పీజీ రంగంలోని యాక్సియం గ్యాస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎస్‌ఎంఈ విభాగంలో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.40 కోట్ల నుంచి రూ.45 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ నెలాఖరులో ఐపీఓ ఉంటుందని కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన సాదిక్ అబ్దుల్ ఖాదర్ బనానీ చెప్పారు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కంపెనీ సొంతంగా 22 ఆటో ఎల్‌పీజీ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఇందులో 12 హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మే కల్లా హైదరాబాద్‌లో మరో నాలుగు ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తామని బనానీ చెప్పారు. వచ్చే ఏడాది మార్చి కల్లా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో మరో 30 ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 12 ఔట్‌లెట్లు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఏర్పా టు చేస్తామని బనానీ చెప్పారు. ఐపీఓ ద్వారా పమీకరించే నిధుల్లో ఎక్కువ భాగాన్ని కంపెనీ ఔట్‌లెట్ల విస్తరణకు ఉపయోగించబోతున్నట్టు తెలిపారు.