Share News

మహీంద్రా @ 50,000కోట్లు

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:05 AM

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీం ద్రా రూ.50,000 కోట్ల ఆదాయం మైలురాయిని దాటింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ కీలక స్థాయిని...

మహీంద్రా @ 50,000కోట్లు

త్రైమాసికాదాయంలో కొత్త రికార్డు

న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీం ద్రా రూ.50,000 కోట్ల ఆదాయం మైలురాయిని దాటింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ కీలక స్థాయిని దాటడం ఇదే ప్రథమం. డిసెంబరు 31వ తేదీతో ముగిసిన వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.51,579.95 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.5,021 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,624.48 కోట్లతో పోల్చితే లాభం 38.54ు పెరిగింది. ఆటో, వ్యవసాయ ఉత్పత్తుల రంగం బలమైన పనితీరు ప్రదర్శించడం ఇందుకు దోహదపడింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.41,464.98 కోట్లుగా ఉంది. నూతన కార్మిక చట్టాల అమలు కారణంగా తమపై 292.94 కోట్ల అదనపు భారం పడిందని కంపెనీ వెల్లడించింది.

3.02 లక్షల వాహనాల విక్రయం

ఆటో విభాగం 3.02 లక్షల త్రైమాసిక విక్రయాలను నమోదు చేసిందని, గత ఏడాదితో పోల్చితే ఇది 23 శాతం అధికమని ఎం అండ్‌ ఎం గ్రూప్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిష్‌ షా అన్నారు. వ్యవసాయ విభా గం సైతం అంతే వృద్ధితో 1.5 లక్షల యూనిట్లు విక్రయించిందని చెప్పారు. కస్టమర్‌ డిమాండు నిలకడగా ఉండడంతో ఈ రెండు విభాగాల్లోనూ తాము అగ్రస్థానాన్ని సాధించగలిగామని ఆయన చెప్పారు. టెక్‌ మహీంద్రా సైతం మంచి వృద్ధిని నమోదు చేసిందని, మహీంద్రా ఫైనాన్స్‌ ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉన్నదని; మహీంద్రా లాజిస్టిక్స్‌, మహీంద్రా లైఫ్‌ సైన్సెస్‌ విభాగాలు సైతం వృద్ధికి తమ వంతు వాటా అందించాయని షా వివరించారు.

అశోక్‌ లేలాండ్‌ లాభం రూ.862 కోట్లు

వాణిజ్య వాహనాల తయారీలోని అశోక్‌ లేలాండ్‌ డిసెంబరు త్రైమాసికంలో 5.19ు వృద్ధితో రూ.862.24 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.11,995.21 కోట్ల నుంచి రూ.14,830.24 కోట్లకు పెరిగింది. అయితే మొత్తం వ్యయాల భారం రూ.10,937.89 కోట్ల నుంచి రూ.13,490.15 కోట్లకు పెరగడం వల్ల లాభాలకు గండి పడింది. క్యు3లో కంపెనీ 32,929 మధ్య, భారీ శ్రేణి వాణిజ్య వాహనాలు; 20,518 తేలిక రకం వాణిజ్య వాహనాలు విక్రయించింది.

Updated Date - Feb 12 , 2026 | 06:07 AM