చిన్న వయసులోనే జీవిత బీమా ఉత్తమం
ABN , Publish Date - Jun 21 , 2026 | 03:57 AM
జీవిత బీమా అనగానే ఇప్పుడెందుకులే తర్వాత చూద్దాం.. ఇంత చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకోవాలా? సరే.. ఎంతో కొంత మొత్తానికి పాలసీ తీసుకుందాం అనుకునే....
జీవిత బీమా అనగానే ఇప్పుడెందుకులే తర్వాత చూద్దాం.. ఇంత చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకోవాలా? సరే.. ఎంతో కొంత మొత్తానికి పాలసీ తీసుకుందాం అనుకునే యువత దేశంలో ఎక్కువగా ఉంటోంది. జీవిత బీమాను ఒక రక్షణ సాధనంగా కాకుండా పొదుపు ఉత్పత్తిగా చూడటమే ఇందుకు కారణం. జీవిత బీమా వయసైన వారి కోసమేనని, తర్వాత చూసుకోవచ్చులే.. అనే భావన కూడా కొంత మందిలో ఉంటోంది. చిన్న వయసులోనే బీమా తీసుకోవడం వల్ల దీర్ఘకాలం మంచి ఆర్థిక ప్రయోజనాలు, రక్షణను పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరం ఉంది. చిన్న వయసులోనే బీమా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే..
తక్కువ ప్రీమియం..
పాలసీదారు వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి జీవిత బీమా ప్రీమియంలు ఉంటాయి. వయసు తక్కువగా ఉండి ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని తక్కువ రిస్క్ పాలసీదారుగా బీమా కంపెనీలు భావిస్తాయి. తక్కువ వయసున్న వారిలో అనారోగ్య పరిస్థితులు తక్కువ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న వయసులోనే బీమా తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణను, రాబడి ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలసీ ఆమోదం ప్రక్రియ కూడా సులభంగా, వేగవంతంగా పూర్తవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ప్రీమియంలు పెరగడానికి లేదా తిరస్కరణకు దారితీయవచ్చు. చిన్న వయసులోనే కొనుగోలు చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తప్పడానికి అవకాశం ఉంటుంది.
రుణ సదుపాయం
చిన్న వయసులోనే జీవిత బీమా పాలసీని తీసుకుంటే దీర్ఘకాలిక ఆర్థిక రక్షణతో పాటు భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా రుణం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎండోమెంట్, యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) వంటి పాలసీలలో లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత పాలసీదారులు పాలసీ సరెండర్ విలువపై 50-90 శాతం రుణాన్ని సులభంగా పొందవచ్చు. ఈ రుణానికి వేగంగా ఆమోదం లభించడానికి, తక్కువ వడ్డీ రేట్లకు, సులభమైన రీపేమెంట్‌కు అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో బీమా ఉపయోగపడుతూనే.. తమపై ఆధారపడిన వారికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
దీర్ఘకాలిక సంపద సృష్టి..
ఎండోమెంట్ ప్లాన్లు లేదా యులిప్స్ వంటి కొన్ని జీవిత బీమా ప్లాన్లలో పొదుపు లేదా పెట్టుబడి భాగం కూడా ఉంటుంది. ఇవి కాలక్రమంలో నగదు విలువను పెంచుతాయి. చిన్న వయసులో ప్రారంభిస్తే.. యువ పాలసీదారులు ఈ ప్రయోజనాన్ని గరిష్ఠంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు లేదా రిటైర్‌మెంట్ కోసం పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకునే ఆస్కారం ఉంటుంది.
పన్ను ప్రయోజనం
జీవిత బీమా ప్రీమియంలపై ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపునకు అవకాశం ఉంటుంది. అలాగే పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చే సొమ్ము సెక్షన్ 10 (10డీ) కింద పన్ను రహితంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలోనే జీవిత బీమా పాలసీని కొనుగోలు నిర్ణయం తీసుకోవడం ద్వారా సంపాదించడం మొదలైనప్పటి నుంచే పన్ను ప్రయోజనాలను పొందుతూ మీ పొదుపులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.