Share News

బీమా భవిష్యత్‌ భేష్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:25 AM

దేశంలో బీమా రంగ వృద్ధికి ఢోకా లేదని ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) సీఈఓ, ఎండీ దొరైస్వామి అన్నారు....

బీమా భవిష్యత్‌ భేష్‌

అపార వృద్ధి అవకాశాలు జూఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ దొరైస్వామి

న్యూఢిల్లీ: దేశంలో బీమా రంగ వృద్ధికి ఢోకా లేదని ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) సీఈఓ, ఎండీ దొరైస్వామి అన్నారు. పెరుగుతున్న ప్రజల ఆదాయాలు, జీవిత కాలాలతో బీమా పాలసీలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోందన్నారు. ఎల్‌ఐసీ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. మన దేశ ప్రజల్లో ఎక్కువ మందికి ఇప్పటికీ బీమా సౌకర్యం లేకపోవడం, ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న కుటుంబ ఆదాయా లు, బీమా రక్షణపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఇందుకు మరింత దోహదం చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో మన్ముందు రక్షణ, పొదుపు, రిటైర్మెంట్‌ పాలసీలకు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడనుందని దొరైస్వామి చెప్పారు.

రెండు కొత్త పాలసీలు

ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు కొత్త పాలసీలను తీసుకువచ్చింది. బీమా ప్లాటినం, జీవన్‌ రక్ష పేరుతో తీసుకువచ్చిన ఈ పాలసీలను ఎల్‌ఐసీ ఎండీ దొరైస్వామి విడుదల చేశారు. ఇందులో బీమా ప్లాటినం.. నాన్‌ పార్‌, నాన్‌ లింక్డ్‌, ఇండివిడ్యువల్‌ ప్లాన్‌తో కూడిన సేవింగ్స్‌, ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అని ఎల్‌ఐసీ తెలిపింది. ఇక జీవన్‌రక్ష కూడా నాన్‌ పార్‌, నాన్‌ లింక్డ్‌, రిస్క్‌ ఆధారిత పాలసీ అని పేర్కొంది. పాలసీ సమయంలో అనుకోకుండా బీమా తీసుకున్న వారు మరణిస్తే వారికి పూర్తి ఆర్థిక రక్షణను ఈ పాలసీ అందించనుంది. ఈ పాలసీ కనీస బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ రూ.5 లక్షలు కాగా గరిష్టంగా రూ.24 లక్షల వరకు ఉందని ఎల్‌ఐసీ తెలిపింది. సింగిల్‌, రెగ్యులర్‌, లిమిటెడ్‌ ప్రీమియం పేమెంట్‌ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉండనుంది. మహిళలకు ఈ ప్లాన్‌ కింద ప్రత్యేక రేట్లు అందుబాటులో ఉంటాయని ఎల్‌ఐసీ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 05:25 AM