Share News

జియో ఐపీఓ ధరల శ్రేణి రూ.1,065-1,119?

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:11 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేఎఫ్ఎల్‌).. ఈ నెలలో ప్రారంభించనున్న తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లో షేర్లను రూ.1,065 -1,119 ధరల శ్రేణిలో ఆఫర్‌ చేయవచ్చని సమాచారం.

జియో ఐపీఓ ధరల శ్రేణి   రూ.1,065-1,119?
jio

  • జియో ఐపీఓ ధరల శ్రేణి రూ.1,065-1,119?

  • రూ.30,213 కోట్ల సమీకరణతో అతిపెద్ద ఐపీఓగా అవతరణ

  • కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల పైనే..

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేఎఫ్ఎల్‌).. ఈ నెలలో ప్రారంభించనున్న తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లో షేర్లను రూ.1,065 -1,119 ధరల శ్రేణిలో ఆఫర్‌ చేయవచ్చని సమాచారం. ఈ ధరల శ్రేణిలో గరిష్ఠ స్థాయి ప్రకారంగా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించనుందని.. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీఓగా అవతరించనుందని బ్లూంబర్గ్‌ కథనం పేర్కొంది. అంతేకాదు, ఐపీఓ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌ మార్కెట్‌ విలువ రూ.10.3 లక్షల కోట్ల స్థాయికి చేరనుందని తెలిపింది. అంటే, తన మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెలికాం సేవల్లో తన ప్రధాన ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాత మూడో అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీగా జియో అవతరించనుంది. బీఎ్‌సఈలో శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15.84 లక్షల కోట్లుగా, ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ విలువ రూ.11.27 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, జియో ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుందని సమాచారం. 28న కంపెనీ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ చేయవచ్చు. ఐపీఓలో భాగంగా కంపెనీ పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లనే జారీ చేయనుందని.. ప్రస్తుత వాటాదారులెవ్వరూ తమ వాటా షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్‌) ద్వారా విక్రయించే ఆలోచనలో లేరని తెలిసింది.

Updated Date - Oct 10 , 2026 | 05:11 AM