Share News

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:02 AM

2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌ (ఏవై)కు సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్‌ ప్రారంభమైంది. ఈ రిటర్నులు ఫైల్‌ చేసే ముందే పన్ను చెల్లింపుదారులు కొన్ని ప్రధాన విషయాలు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవడం మంచిది.

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి..

2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌ (ఏవై)కు సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్‌ ప్రారంభమైంది. ఈ రిటర్నులు ఫైల్‌ చేసే ముందే పన్ను చెల్లింపుదారులు కొన్ని ప్రధాన విషయాలు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఐటీ శాఖ నుంచి రిఫండ్‌లో జాప్యం, ట్యాక్స్‌ డిమాండ్లు, పెనాల్టీలు, కంప్లయెన్స్‌ అలర్ట్‌లు, నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఐటీ రిటర్నులు ఫైల్‌ చేసే ముందే అన్ని విషయాలను పన్ను చెల్లింపుదారులు క్షుణ్ణంగా తెలుసుకుని ఉండడం మంచిది. అవేమిటంటే..

సరైన ఫారాన్ని ఎంచుకోవడం

  • రూ.50 లక్షల లోపు ఆడిటింగ్‌ అవసరం లేని వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీఆర్‌-1 (సహజ్‌) లేదా ఐటీఆర్‌-4 (సుగమ్‌) ఫారాన్ని ఎంచుకోవాలి. పన్ను చెల్లింపుదారు ఆదాయం, క్యాటగిరి, ఆదాయ స్వభావం, వారి నివాస స్థితులను బట్టి ఈ ఫారాల ఎంపిక ఉంటుంది.

  • వ్యాపార ఆదాయమైతే క్యారీ ఫార్వర్డ్‌ లాస్‌ కూడా చూడాలి. రెండు ఇళ్లపై ఆదాయం ఉంటే ఐటీఆర్‌-1 ఫారం సరిపోతుంది. అదే గృహ ఆస్తి ఆదాయంపై నష్టం చూపించాల్సి వస్తే మాత్రం ఐటీఆర్‌-1 సరిపోదు.

  • వార్షికాదాయం రూ.50 లక్షల వరకు ఉన్నా, అందులో విదేశీ ఆదాయం ఉంటే ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4 ఫారాల్లో రిటర్నులను అనుమతించరు.

  • సరైన ఐటీఆర్‌ ఫారమ్‌లో రిటర్న్‌ ఫైల్‌ చేయలేకపోతే.. ఐటీ శాఖ అనుమతించిన గడువులోగా సరైన ఫారమ్‌లో రిటర్న్‌ ఫైల్‌ చేయాలి. ఈ విషయంలో ఆలస్యమైతే, మీరు ఫైల్‌ చేసిన ఐటీఆర్‌ను చెల్లని ఐటీఆర్‌గా పరిగణించి ఐటీ శాఖకు చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా వసూలు చేయవచ్చు.

ప్రీ ఫిల్డ్‌ ఐటీఆర్‌ డేటాతో పోలిక

ఇప్పుడున్నది డేటా ఆధారిత యుగం. ఎప్పుడు ఏ పెద్ద ఆర్థిక లావాదేవీ జరిపినా అది వెంటనే ఐటీ శాఖకు చేరిపోతుంది. ఆధార్‌, పాన్‌ నంబర్లే ఈ విషయంలో ఐటీ శాఖకు కళ్లు, చెవులు. ఈ వివరాలు అన్నిటిని ఐటీ శాఖ ముందుగానే మీ ఐటీ రిటర్న్‌లో నమోదు చేసి ఉంటుంది. రిటర్న్‌ ఫైల్‌ చేసేటపుడు మీ ఫారమ్‌ 16, ఫారమ్‌ 16ఏ, ఫారమ్‌ 26ఏఎస్‌, యాన్యువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్‌)లోని సమాచారం ఐటీ శాఖ ముందే ప్రిపేర్‌ చేసిన ప్రీ ఫిల్డ్‌ డేటాతో సరిపోయి ఉండాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడాలు ఉన్నా పన్ను చెల్లింపుదారులకు తిప్పలు తప్పవు. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తే ట్యాక్స్‌ డిమాండ్లు, వడ్డీ, పెనాల్టీలు, ఇతర క్రమశిక్షణ చర్యలు తప్పవు. అదే ఆదాయాన్ని ఎక్కువగా చూపిస్తే పన్ను చెల్లింపు భారం పెరుగుతుంది.


పూర్తి ఆదాయ వెల్లడి

రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు ఏ పద్దు కింద ఎంత ఆదాయం వచ్చింది అనే విషయాన్ని పన్ను చెల్లింపుదారులు స్పష్టంగా పేర్కొనాలి. ఐటీ శాఖ ముందుగా ప్రిపేర్‌ చేసిన రిటర్న్‌లోనే ఇదంతా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏ పద్దు కింద ఎంత ఆదాయం వచ్చిందనే విషయం వెల్లడించడం పన్ను చెల్లింపుదారు బాధ్యత. ఐటీ శాఖ పూర్తి చేసిన ప్రీ ఫిల్డ్‌ ఫారమ్‌లోని విషయాలనే మేము కోట్‌ చేశామంటే కుదరదు. ఈ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ట్యాక్స్‌ మినహాయింపులు కూడా కోల్పోవాల్సి వస్తుంది. మూలంలో పన్ను కోత (టీడీఎస్‌) ఆదాయం వెల్లడించే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

మినహాయింపులు, తగ్గింపులు

ఐటీ శాఖ కొన్ని పెట్టుబడులు, ఆదాయాలు, ఖర్చులకు పన్ను పోటు నుంచి మినహాయింపులు, తగ్గింపులు ఇస్తోంది. చాలా మంది పన్ను పోటు తగ్గుతుందని ఈ విషయంలో కొన్ని లేనిపోని పెట్టుబడులు, ఆదాయాలు, ఖర్చులు చూపిస్తుంటారు. ఈ పద్దతి ఏ మాత్రం మంచిది కాదు. ఐటీ శాఖ ప్రస్తుతం ఎవరి ఆదాయ, వ్యయాలు, పెట్టుబడులు ఎంత అనే విషయాన్ని ఏఐ టూల్స్‌తో జల్లెడ పడుతోంది. ఈ విషయంలో మీరు తప్పు చేశారని తేలితే నోటీసులు, అదనపు పన్నులు, చెల్లించాల్సిన పన్నుపై 200 శాతం వరకు పెనాల్టీలు తప్పవు.

గడువులోగా ఫైల్‌ చేయడం

గడువులోగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం అన్నిటికంటే ముఖ్యం. ఇంకా టైమ్‌ ఉంది కదా అని ఆలస్యం చేస్తే చివర్లో ఐటీ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగి సమస్యలు రావచ్చు. గడువు లోగా సమర్పించకపోతే లేటు ఫీజు, వడ్డీ చెల్లింపు వంటి సమస్యలు రావచ్చు. గడువు తీరిన తర్వాత రిటర్నులు ఫైల్‌ చేస్తే కొన్ని పన్ను మినహాయింపులనూ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే సమయానికి రిఫండ్స్‌ రావడంతో పాటు ఇతర సమస్యలూ ఉండవు.


పన్ను మినహాయింపు ఆదాయం వెల్లడి

మినహాయింపు లభించే ఆదాయంపై పన్ను భారం ఉండదు. అయినా ఈ ఆదాయాన్ని కూడా ఐటీ రిటర్న్‌లో వెల్లడించాల్సిందే. లేకపోతే తిప్పలు తప్పవు. ఉదాహరణకు ఒక వ్యక్తి గత ఆర్థిక సంవత్సరం రిటైరయ్యారు. అప్పుడు అతనికి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, పెన్షన్‌ రూపంలో రూ.1.6 కోట్లు చేతికి వచ్చాయి. ఈ ఆదాయం పూర్తిగా పన్ను మినహాయింపు ఆదాయం. ఈ పన్ము మినహాయింపు ఆదాయంతో అతను ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని అతడు తప్పనిసరిగా 2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌ ఐటీ రిటర్న్‌లో వెల్లడించాలి. అలా కాకుండా గత ఆర్థిక సంవత్సరం జీతం, పెన్షన్‌ రూపంలో వచ్చిన ఆదాయాన్ని మాత్రమే చూపి, మిగతా ఆదాయాన్ని చూపకపోతే, అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసి మరీ అడుగుతుంది. అంటే పన్ను మినహాయుంపు ఉండే ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా మీ ఐటీ రిటర్న్‌లో వెల్లడించాలి.

రిఫండ్‌ బ్యాంకు ఖాతా అప్‌డేషన్‌

ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు మీ బ్యాంకు ఖాతా క్రియాశీలంగా ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోండి. ఖాతా చురుగ్గా లేకపోతే దాన్ని క్రియాశీలం చేయాలి. లేకపోతే ఐటీ శాఖ పంపించే రిఫండ్స్‌ మీకు చేరడం పెద్ద సమస్య అవుతుంది. ఒకవేళ గత ఆర్థిక సంవత్సరం మీ బ్యాంకు ఖాతా మూసివేసి.. కొత్త ఖాతా తెరిస్తే ఆ వివరాలనీ పూర్తిగా ఐటీ రిటర్న్‌ ఫారంలో తెలియజేయాలి.

Updated Date - Jun 21 , 2026 | 04:02 AM