ప్రతికూలతల్లోనూ టెక్ కంపెనీల హవా
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:28 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కృత్రిమ మేధ (ఏఐ) విధ్వంసం నేపథ్యంలోనూ దేశీయ టెక్నాలజీ రంగ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం...
6శాతం వృద్ధితో రూ. 28.65 లక్షల కోట్లకు ఆదాయం
మరో 1.35 లక్షల ఉద్యోగాలు జూనాస్కామ్ అంచనా
ముంబై: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కృత్రిమ మేధ (ఏఐ) విధ్వంసం నేపథ్యంలోనూ దేశీయ టెక్నాలజీ రంగ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) 6.1శాతం వృద్ధితో 31,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.28.65 లక్షల కోట్లు) చేరుకోనుందని నాస్కామ్ అంటోం ది. నాస్కామ్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025-26లో టెక్ రంగంలో ఉద్యోగుల సంఖ్య నికరంగా మరో 1.35 లక్షలు పెరిగి 59.5 లక్షలకు చేరుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని ఐటీ ఉద్యోగుల మొత్తం సంఖ్య 58.15 లక్షలుగా ఉంది. 2024-25 లో ఇండస్ట్రీ నికరంగా 1.33 లక్షల మందిని నియమించుకుంది. ఈ సారి ఉద్యోగాల వృద్ధి 2.3ు, ఆదాయ వృద్ధి 6.1శాతం మధ్య స్పష్టమైన భేదం కనిపించినప్పటికీ ఇండస్ట్రీ పనితీరు సంతృప్తికరంగానే ఉందని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ అన్నారు.
మరిన్ని ముఖ్యాంశాలు..
టెక్నాలజీ రంగంలో గణనీయ మార్పులు వస్తున్నప్పటికీ, ఐటీ రంగంలో ఉద్యోగుల పెరుగుదల భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రస్తుత 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఏఐలో శిక్షణ తీసుకున్నారు. అందులో 3 లక్షల మంది అడ్వాన్స్‌డ్ ఏఐ నైపుణ్యాలు కలిగి ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఏఐ ఆదాయం 1,000-1,200 కోట్ల డాలర్ల (రూ.90,950-1,09,140 కోట్లు) స్థాయిలో ఉండవచ్చని అంచనా.
2024-25 ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమ ఆదాయాన్ని గత ఫిబ్రవరిలో అంచనా వేసిన 28,260 కోట్ల డాలర్ల నుంచి 29,700 కోట్ల డాలర్లకు పెంచింది.
గతంలో ఐటీ రంగ ఆదాయంలో అమెరికా మార్కెట్ అధిక వృద్ధి కలిగి ఉండేది. కానీ, ఈ సారి ఆసియా పసిఫిక్, పశ్చిమాసియా మార్కె ట్లు అద్భుతమైన వృద్ధి నమోదు చేశాయి. దేశీయ మార్కెట్ ఆదాయ వృద్ధి 7.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రపంచ సగటు కంటే ఇది అధికం.
రంగాలవారీగా చూస్తే, హెల్త్‌కేర్, ట్రావెల్, రవాణా రంగాలు వేగవంతమైన వృద్ధి కనబరిచాయి.