ఐటీని వీడని స్తబ్దత
ABN , Publish Date - Jul 06 , 2026 | 02:51 AM
దేశంలోని ఐటీ సేవల కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (క్యూ1) కూడా పెద్దగా కలిసొచ్చేలా లేదు. ఈ త్రైమాసికంలోనూ ఈ కంపెనీల ఆదాయ వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉంటుందని ...
టెక్ పెట్టుబడులపై కంపెనీల మల్లగుల్లాలు
క్యూ1లోనూ ఐటీ సర్వీస్ కంపెనీలకు నిరాశే
ఆదాయాల వృద్ధి రేటు అంతంతే..
ఈక్విరస్ సెక్యూరిటీస్ అంచనా
న్యూఢిల్లీ: దేశంలోని ఐటీ సేవల కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (క్యూ1) కూడా పెద్దగా కలిసొచ్చేలా లేదు. ఈ త్రైమాసికంలోనూ ఈ కంపెనీల ఆదాయ వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉంటుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ అనే బ్రోకరేజి సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీల ఆదాయ వృద్ధికి 1.7శాతం వరకు గండిపడే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ ఆదాయ వృద్ధి రేటు పెరిగినా అది 1.1శాతానికి మించి ఉండదని స్పష్టం చేసింది. ఐటీ పెట్టుబడులపై కంపెనీలకు స్పష్టత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏఐ టూల్స్ వినియోగం, పెట్టుబడులపై చేకూరే ప్రయోజనాలపై స్పష్టత లేకపోవడంతో ఐటీ కంపెనీల ఖాతాదారులు కొత్త పెట్టుబడులపై వెనకాడుతున్నారు. క్యూ1లో భారత ఐటీ కంపెనీల ఆదాయాలకు గండి పడేందుకు ఇదే ప్రధాన కారణమని ఈక్విరస్ సెక్యూరిటీస్ తెలిపింది.
విప్రోకే పెద్ద గండి: టెక్ ఖర్చులపై ఐటీ కంపెనీల ఖాతాదారు కంపెనీల్లో కొనసాగుతున్న గుంజాటన జూన్ త్రెమాసికంలో విప్రో కంపెనీని బాగా దెబ్బతీయనుంది. ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2శాతం వరకు దెబ్బతినే అవకాశం ఉందని ఈక్విరస్ సెక్యూరిటీస్ అంచనా. లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీల్లో టెక్ మహీంద్రా కంపెనీ పరిస్థితీ ఇలాగే ఉంటుందని తెలిపింది. మిడ్‌సైజ్ ఐటీ కంపెనీల్లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, ఇక్లర్‌ఎక్స్ ఆదాయాల వృద్ధి రేటు మాత్రం క్యూ1లోనూ బాగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఉద్రిక్తతలు, ఏఐ ఆధారిత టూల్స్‌తో పెరిగే ఉత్పాదకతతో కంపెనీలు ఐటీ పెట్టుబడులు తగ్గించడం ఇందుకు ప్రధాన కారణంగా ఈక్విరస్ సెక్యూరిటీస్ తెలిపింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కంపెనీలు టెక్నాలజీ అప్‌గ్రెడేషన్స్‌పై గతంలో మాదిరిగా ఎడాపెడా ఖర్చు చేయడం లేదు. ఐటీ బడ్జెట్‌లు పెంచుకోవడం కంటే ఖర్చులకు తగ్గట్టు గరిష్ఠస్థాయిలో ఆదాయాలు వచ్చేలా ఔట్‌సోర్సింగ్, వెండర్ కన్సాలిడేషన్ మార్గాలు ఎంచుకుంటున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని విషయాల్లో కంపెనీలకు ఐటీ సేవల కంపెనీల అవసరం కీలకమని ఈక్విరస్ సెక్యూరిటీస్ అంచనా. కంపెనీలు పెద్దఎత్తున ఎల్‌ఎల్‌ఎం, ఎస్‌ఎల్‌ఎంలు, ఫ్రంటియర్, ఓపెన్-సోర్స్ మోడల్స్, మల్టిపుల్ మోడల్ ఏఐ ఏజెంట్ల వినియోగం, ఎంటర్‌ప్రైజ్ డేటా ప్లాట్‌ఫామ్స్ వినియోగంతో కంపెనీల్లో ఏఐ వాతావరణం మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ సానుకూల అంశాలు ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికం ఐటీ సేవల కంపెనీలకు పెద్దగా కలిసి రాకపోవచ్చని ఈక్విరస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.