భారత ఐటీ కంపెనీల పంథా మారాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:53 AM
భారత ఐటీ కంపెనీలు అమెరికాపై అతిగా ఆధారపడడం ఇక ఏ మాత్రం మంచిది కాదని ప్రముఖ మేధో సంస్థ జీటీఆర్‌ఐ హెచ్చరించింది. అమెరికా తాజా ఆంక్షలు ఆ దేశంలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల జారీ కట్టడితోనే ఆగదని స్పష్టం చేసింది.
అమెరికాపై అతిగా ఆధారపడొద్దు
గ్రీన్ కార్డుల కట్టడితోనే ట్రంప్ ఆగడు
త్వరలో మరిన్ని రక్షణ చర్యలకు అవకాశం
వేరే మార్కెట్లపైనా దృష్టి పెట్టడం మంచిది
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలు అమెరికాపై అతిగా ఆధారపడడం ఇక ఏ మాత్రం మంచిది కాదని ప్రముఖ మేధో సంస్థ జీటీఆర్‌ఐ హెచ్చరించింది. అమెరికా తాజా ఆంక్షలు ఆ దేశంలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల జారీ కట్టడితోనే ఆగదని స్పష్టం చేసింది. స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు, విదేశీ ఉద్యోగుల నియామకాలను దెబ్బతీసేందుకు ట్రంప్ సర్కారు త్వరలో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని జీటీఆర్‌ఐ సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భారత ఐటీ కంపెనీలు తమ ఐటీ సేవల ఎగుమతుల కోసం ఇతర దేశాల మార్కెట్ల పైనా దృష్టి పెటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘విదేశీ టెక్ నిపుణుల నియామకాలను కట్టడి చేసేందుకు అమెరికా మరిన్ని రక్షణ చర్యలు తీసుకోబోతోంది. గ్రీన్ కార్డుల జారీ రద్దు.. రాబోయే గడ్డు పరిస్థితులను సూచిస్తోంది.ఈ నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలు తమ ఎగుమతి మార్కెట్లను మరింత విస్తృతం చేసుకోవాలి. భారత్ నుంచే సేవల డెలివరీలు పెంచాలి. ఇందుకోసం స్థానిక నియామకాలనూ పెంచాలి’ అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
ఎగుమతుల్లో 54 శాతం అక్కడికే
అమెరికా తాజా నిర్ణయం ప్రభావం ఇప్పటికిప్పుడైతే ఆ దేశంలోని భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండదని జీటీఆర్‌ఐ స్పష్టం చేసింది. కాకపోతే నిపుణులైన భారత ఐటీ నిపుణులను శాశ్వత ప్రాతిపదికన అమెరికాలో ఉంచుకోవడమే పెద్ద సమస్య కానుందని పేర్కొంది. మన ఐటీ ఎగుమతుల్లో 54.1 శాతం ఒక్క అమెరికాకు జరగడం, ఆ దేశం ఏటా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో 70 శాతానికిపైగా భారతీయులకు రావడమే పెద్ద సమస్యగా మారిందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
మరోవైపు అమెరికా తాజా నిర్ణయం ఆ దేశంలో పని చేస్తున్న భారత ఐటీ కంపెనీల కార్యకలాపాలను దెబ్బతీసే అవకాశం ఉందన్న భయాలను దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తోసిపుచ్చింది. ఈ నిర్ణయం అక్కడ తమ నియామకాల వ్యూహాలను గానీ, డీల్స్ కోసం కస్టమర్లతో జరిపే చర్చలను గానీ ఏ మాత్రం దెబ్బతీసే అవకాశం లేదని పేర్కొంది. గత రెండేళ్లుగా అమెరికాలో తాము స్థానిక అమెరికా ఉద్యోగుల నియామకాలపైనే దృష్టి పెట్టినట్లు తెలిపింది. గత రెండేళ్లలో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన తమ ఉద్యోగుల సంఖ్య కూడా సింగిల్ డిజిట్‌లోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
రెండూ వేరు వేరు..
భారత ఐటీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ మాత్రం తాజా పరిణామాలపై భిన్నంగా స్పందించింది. వలసలు, నిపుణులైన ఉద్యోగుల రాకపోకలు రెండూ వేరు వేరు విషయాలని పేర్కొంది. ఈ రెండు విషయాలను ఒకే దృష్టితో చూడకూడదని స్పష్టం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలను తగ్గించి, స్థానిక అమెరికా ఉద్యోగుల నియామకాలను పెంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేసింది. దీంతో గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసే భారత ఉద్యోగుల సంఖ్యా గణనీయంగా తగ్గిపోయినట్టు నాస్కామ్ తెలిపింది.
ఇది ఒక హెచ్చరిక
విదేశీ ఉదోగులు అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు దోహదం చేసే గ్రీన్ కార్డుల దరఖాస్తులను స్తంభింప చేస్తున్నట్టు అమెరికా గురువారం ప్రకటించింది. ‘భారత ఐటీ కంపెనీలకు ఇదో హెచ్చరిక. దీని ప్రభావం అమెరికాలోని నాలుగు ప్రధాన భారత ఐటీ కంపెనీలపై పడుతుంది. గ్రీన్ కార్డు పొంది అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవాలన్న ఈ కంపెనీల ఉద్యోగుల ఆశలకూ గండి పడుతుంది. దీంతో శాశ్వత ప్రాతిపదికన అమెరికాలో నిపుణులైన ఉద్యోగులను నియమించుకోవాలన్న భారత ఐటీ కంపెనీల ప్రణాళికలపైనా అనిశ్చితి ఏర్పడుతుంది’ అని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
మనకు మంచిదే..
అమెరికా తాజా ఆంక్షల ప్రభావం ఒక విధంగా మన దేశానికి మేలు చేస్తుందనే అంచనాలూ వినిపిస్తున్నాయి. ఈ ఆంక్షలు అమెరికాలో భారత ఐటీ కంపెనీల కార్యకలాపాలను, వాటిల్లో పనిచేసే భారతీయుల గ్రీన్ కార్డు ఆశలపై నీళ్లు చల్లాయి. అయితే దీంతో అమెరికా దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు భారత్‌లో మరింత పెద్దఎత్తున తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే మన ఐటీ బాబులకు స్వదేశంలోనే మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని నిపుణుల అంచనా. మైక్రోసాఫ్ట్, అడోబ్‌తో సహా అనేక అమెరికా దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పటికే భారత్‌లో తమ జీసీసీలను ఏర్పాటు చేశాయి. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కార్ మరింత కట్టడి చేస్తే మరిన్ని అమెరికా కంపెనీలు తమ ఇంజనీరింగ్, ప్రాజెక్టు పనులతో పాటు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను కూడా భారత్‌లోని జీసీసీలకు తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు.