పెరిగిన ధరలు.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో డిమాండ్ ఢమాల్
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:56 PM
స్మార్ట్ ధరల పెరుగుదలతో వినియోగదారులు భయపడుతున్నారు. ఫోన్ కొనేందుకు జంకుతున్నారు. దీంతో, మార్కెట్‌లో భారీ క్షీణత కనిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ధరల పెరుగుదలతో వినియోగదారులు భయపడుతున్నారు. ఫోన్ కొనేందుకు జంకుతున్నారు. దీంతో, మార్కెట్‌లో క్షీణత నమోదైంది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ తగ్గడంతో స్మార్ట్‌ఫోన్ షిమ్‌మెంట్స్ ఏకంగా 20 శాతం మేర తగ్గిపోయాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ఇక రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ ఏకంగా 47 శాతం మేర తగ్గిపోయాయి. ధరలు పెరగడంతో కొన్ని మోడల్స్ రూ.20 వేల పైచిలుకు కేటగిరీలోకి చేరడం కూడా ఇందుకు ఒక కారణని కౌంటర్‌పాయింట్ పేర్కొంది.
మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ శాంసంగ్ మాత్రం టాప్ స్థానంలో నిలిచింది. 17 శాతం మార్కెట్ షేర్ సాధించింది. గ్యాలెక్సీ ఏ సిరీస్ ఫోన్ల విక్రయాలు పెరగడం ఇందుకు దోహదపడిందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది. 16 శాతం మార్కెట్ షేర్‌తో వివో రెండో స్థానంలో, 12 శాతం వాటాతో ఒప్పో మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో ఉన్న షియోమీ, యాపిల్ చెరో 8 శాతం మార్కెట్ సాధించాయి. పోకో మార్కెట్ వాటా 4 శాతంగా ఉంది. ఈ ఏడాది టాప్ ఐదుస్థానాల్లో ఉన్న బ్రాండ్స్‌లో శాంసంగ్ ఒక్కటే వృద్ధి సాధించినట్టు కూడా కౌంటర్‌పాయింట్ తన నివేదికలో తెలిపింది.
ధరల పెరుగుదల.. కారణం ఇదీ..
మెమరీ ధరలు పెరగడంతో స్మార్ట్ ఫోన్ తయారీ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వినియోగదారులు కొనుగోళ్లు తగ్గి్స్తున్నారు. కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలన్న నిర్ణయాన్ని అనేక మంది వాయిదా వేస్తున్నారని కౌంటర్ పాయింట్ పేర్కొంది. మరోవైపు సంస్థలు కూడా తమ ఉత్పత్తుల్లో మార్పులు చేర్పులు చేస్తూ నిల్వలు పెరిగిపోకుండా జాగ్రత్త పడుతున్నాయని అంటున్నారు. ఈ పరిణామాల ప్రభావం రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై అధికంగా ఉంది. డిమాండ్ తగ్గుదల ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది స్థూలంగా డిమాండ్ 13 శాతం తగ్గే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
పది రోజుల్లోనే రూ.33 వేల పతనం.. ఇప్పుడు వెండి కొనొచ్చా..
స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా అమ్మకాలు..