ధరలు భగభగ!
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:36 AM
దేశంలో ధరల సెగ కొనసాగుతోంది. ఈ సెప్టెంబరులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి ఎగబాకింది
సెప్టెంబరులో 5.54 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిక
తెలుగు రాష్ట్రాల్లో మరింత భారం
న్యూఢిల్లీ : దేశంలో ధరల సెగ కొనసాగుతోంది. ఈ సెప్టెంబరులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి ఎగబాకింది. ఈ ఆగస్టులో నమోదైన 4.83 శాతంతో పోల్చితే ఇది 0.71 శాతం ఎక్కువ. దాదాపు రెండేళ్లలో సూచీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో ఉల్లి ధర 108.09 శాతం, వెండి ఆభరణాల ధర 87.8 శాతం, అల్లం రేటు 62.85 శాతం, వెల్లుల్లి ధర 54.62 శాతం, నిమ్మకాయల ధర 36.41 శాతం మేర పెరిగాయి. దీంతో ఈ ఆగస్టులో 5.97 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 7.74 శాతానికి ఎగబాకినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) సోమవారం తెలిపింది. ధరల సెగ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని మిజోరంలో మాత్రం గత నెలలో ధరల సెగ పెద్దగా కనిపించలేదు. ఎల్‌నినో ప్రభావంతో మున్ముందు ఆహార ద్రవ్యోల్బణం మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. పశ్చిమాసియా సంక్షోభంతో సెగలు కక్కుతున్న చమురు మంట ఇందుకు మరింత ఎసరు పెట్టనుంది.