వచ్చే 10-14 నెలల్లో స్వదేశీ డిజైన్ మొబైళ్లు
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:50 AM
దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు రూపొందించిన రూ.62,500 కోట్ల మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంఎ్‌స)ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మొబైల్ ఫోన్ల తయారీకి రూ.62,500 కోట్ల పథకం
రూ.10,000 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు అర్హత
మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు రూపొందించిన రూ.62,500 కోట్ల మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంఎ్‌స)ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.10,000 కోట్ల టర్నోవర్ కలిగిన మొబైల్ ఫోన్ కంపెనీలు, ఎలకా్ట్రనిక్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు ఈ పథకం ప్రయోజనాలకు అర్హత పొందుతాయని శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం మద్దతుతో వచ్చే 10-14 నెలల్లో పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసిన, మేధో సంపత్తి (ఐపీ) హక్కులు కలిగిన భారత బ్రాండ్ మొబైళ్ల్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ సందర్భంగా అన్నారు. అలాగే, భారత బ్రాండ్లకు సంబంధించి కఠిన తనిఖీలు చేస్తామని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టే వారికి ఈ పథక ప్రయోజనాలను అనుమతించమని ఆయన నొక్కి చెప్పారు. ఈ పథక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే భారత కంపెనీలు తమ మొబైల్ డిజైన్లు మేధో సంపత్తి (ఐపీ) హక్కులు కలిగి ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పథకం మార్గదర్శకాల్లోని మరిన్ని వివరాలు..
గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 టర్నోవర్ కలిగిన, 51 శాతం భారత యాజమాన్య వాటా కలిగిన మొబైల్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) సంస్థలు సైతం ఈ పథకం ప్రయోజనాలను అందుకోవచ్చు.
కేంద్రం ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించింది. ఇందులో మొదటిది.. మొబైల్ తయారీకి ప్రోత్సాహకాలు అందించడం. రెండోది.. దేశీయ మొబైల్ బ్రాండ్ల అభివృద్ధికి మద్దతివ్వడం.
దేశంలో మొబైల్స్ తయారు చేసే కంపెనీలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలను అందించడమే ఎంపీఎంఎస్ పథకం లక్ష్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. అంటే, 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న బ్రాండ్లు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను అందుకునేందుకు ఐదేళ్ల పాటు తమ విక్రయాలను ఏటేటా రూ.5,000 కోట్ల చొప్పున పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే, 2025-26లో రూ.10,000 కోట్లకు పైగా టర్నోవర్ ద్వారా అర్హత సాధించిన కంపెనీ.. 2026-27లో తన విక్రయాలను రూ.15,000 కోట్లకు, 2027-28లో రూ.20,000 కోట్లకు, 2028-29లో రూ.25,000 కోట్లకు, 2029-30లో రూ.30,000 కోట్లకు, 2030-31లో రూ.35,000 కోట్ల స్థాయికి పెంచుకోవాల్సి ఉంటుంది.
ఏదైనా కొత్త బ్రాండ్ ఈ పథక ప్రయోజనాలను అందుకోవాలంటే, దేశీయంగా రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించాకే అర్హత లభిస్తుంది.
ఆయా ఆర్థిక సంవత్సరానికి ప్రోత్సాహక రేటుతో గుణించబడిన అర్హత విక్రయాల విలువ ఆధారంగా కంపెనీలకు ప్రోత్సాహక సొమ్ము లభిస్తుంది. 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాలకు కేంద్రం ప్రోత్సాహక రేటును 2.75 శాతంగా నిర్ణయించగా.. 2028-29, 2029-30 ఆర్థిక సంవత్సరాలకు ఇది 2.5 శాతంగా, 2023-31లో 2.25 శాతంగా ఉంది.
మొబైల్స్ తయారీకి అవసరమైన డిస్‌ప్లే మాడ్యూల్స్, బ్యాటరీలు, యూఎ్‌సబీ కేబుల్స్ తదితర విడిభాగాలను దేశీయంగా సేకరించే కంపెనీలకు 1.5 శాతం అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
భారత మొబైల్ ఫోన్ బ్రాండ్లకు మద్దతు విభాగంలో దరఖాస్తు చేసుకునే దేశీయ కంపెనీలకు కనీస అర్హతలేమీ లేవు. భారత మొబైల్ బ్రాండ్లకు అర్హత కలిగిన దేశీయ తయారీ ఫోన్ల విక్రయాలపై 5 శాతం ప్రోత్సాహకాలు లభించనున్నాయి. దాంతోపాటు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కు 3 శాతం అదనపు ప్రోత్సాహకాలు అందుకునే వీలుంటుంది.
ఐదేళ్లలో రూ.39 లక్షల కోట్లకు ఉత్పత్తి
ఈ పథకంతో దేశంలో మొత్తం మొబైల్స్ ఉత్పత్తి ఐదేళ్లలో దాదాపు రెట్టింపు స్థాయి రూ.39 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే, ఈ స్కీమ్‌తో 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించవచ్చని కూడా భావిస్తోంది.