జోరందుకున్న ఐపీఓ మార్కెట్
ABN , Publish Date - Jul 06 , 2026 | 02:50 AM
ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ప్రథమార్ధంలో దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు చుక్కలు చూపింది. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 10.25 శాతం...
ద్వితీయార్ధంలో రూ.4.74 లక్షల కోట్ల సమీకరణకు సిద్ధం
ముంబై: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ప్రథమార్ధంలో దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు చుక్కలు చూపింది. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 10.25 శాతం, నిఫ్టీ 50 సూచీ 8.66 శాతం నష్టపోయాయి. ఇదే సమయంలో ఐపీఓ మార్కెట్ మాత్రం కళకళలాడింది. దాదాపు 27 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.22,555 కోట్లు సమీకరించాయి. డిసెంబరుతో ముగిసే ద్వితీయార్ధంలో ప్రైమరీ మార్కెట్ మరింత జోరందుకుంటుందని ప్రైమ్ డేటాబేస్ అనే సంస్థ అంచనా. ఈ ఆరు నెలల్లో దాదాపు 238 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.4.74 లక్షల కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో రూ.2.77 లక్షల కోట్లు సమీకరించే 174 కంపెనీల ఐపీఓలకు సెబీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రూ.1.95 లక్షల కోట్లు సమీకరించేందుకు మరో 64 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాయి. దీంతో ఐపీఓ సమీకరణలు ఈ సంవత్సరం మరో సరికొత్త రికార్డు సృష్టిస్తాయని భావిస్తున్నారు. ద్వితీయార్ధంలో మార్కెట్లోకి వచ్చే ఐపీఓల్లో ఎన్‌ఎ్‌సఈ, రిలయన్స్ జియో ఐపీఓలతోపాటు ఎల్‌ఐసీ ఫాలో ఆన్ ఆఫర్ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.