Share News

ధరలకు యుద్ధం పోటు

ABN , Publish Date - Apr 14 , 2026 | 03:59 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతలు దేశం లో ఆహార వస్తువుల ధరలను పోటెత్తించాయి. ఫలితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.4 శాతానికి చేరింది.

ధరలకు యుద్ధం పోటు

  • మార్చి ద్రవ్యోల్బణం 3.4 శాతం

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు దేశం లో ఆహార వస్తువుల ధరలను పోటెత్తించాయి. ఫలితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.4 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతం ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన కట్టడి పరిధి 4 శాతం (2శాతం ఎగువకు లేదా దిగువకు సద్దుబాటుతో) కన్నా దిగువనే ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) 2024 ఆధారిత సంవత్సరంగా రూపొందించిన కొత్త సిరీస్‌కు అనుగుణంగా మార్చి ద్రవ్యోల్బణం గణాంకాలను సోమవారం విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 3.47శాతం నుంచి 3.87 శాతానికి దూసుకుపోయింది. బంగారం, వెండి ఆభరణాలు, కొబ్బరి, టమాటా, కాలీఫ్లవర్‌ ధరలు పోటెత్తాయి. ఉల్లి, బంగాళాదుంప, వెల్లుల్లి, మినప్పప్పు, వేరుశనగ ధరలు మాత్రం తగ్గాయి.

తెలంగాణలో అత్యధికం

ధరల పోటు తెలంగాణలో అధికంగా ఉంది. ఇక్కడ గరిష్ఠంగా 5.83శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరంలో అత్యంత కనిష్ఠంగా 0.66శాతం ఉంది. ప్రాంతాలవారీగా చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో 3.63శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11శాతం ఉంది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధర భారీగా పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచరాదన్న ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు దోహదపడిందని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ నిర్మల్‌ కె మిండా అన్నారు.

పెరిగిన వంటనూనెల దిగుమతులు

వంటనూనెల దిగుమతి మార్చిలో 12శాతం పెరిగి 11,73,168 టన్నులకు చేరింది. గత ఏడాది మార్చిలో 10,45,281 టన్నుల వంటనూనెలు దిగుమతి అయినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది మార్చిలో వంటనూనెల దిగుమతి 10,73,023 టన్నులుగా ఉంది. అయితే వంటనూనెలు మినహా ఇతర వస్తువుల దిగుమతులు 27,742 టన్నుల నుంచి 13,401 టన్నులకు తగ్గాయి. దేశంలో వంటనూనెల డిమాండులో సగానికి పైగా దిగుమతులే ఆధారం.

Updated Date - Apr 14 , 2026 | 03:59 AM