కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి మరింత ప్రియం
ABN , Publish Date - May 13 , 2026 | 08:21 AM
బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచింది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తాజాగా పెంచింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను 5 శాతానికి పెంచింది. దీంతో, మొత్తం దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. గతంలో ఇది 6 శాతంగా ఉండేది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 95.75కి పతనమైన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పెంచింది.
బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వెండి వినియోగంలో ప్రథమ స్థానంలో ఉంది. దేశీయ అవసరాల కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇక ఈక్విటీ మార్కెట్‌లో రాబడులు మందగించిన నేపథ్యంలో గతేడాది భారత్‌లో బంగారానికి డిమాండ్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో గోల్డ్ ఆధారిత ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 186 శాతం మేర పెరిగాయి.
కస్టమ్స్ డ్యూటీ పెంపుతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ధరలు అధికంగా ఉన్నందున కస్టమ్స్ డ్యూటీ పెంపుతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి దిగుమతుల కట్టడి కోసం ఇటీవల ప్రభుత్వం 3 శాతం ఐజీఎస్‌టీ విధించింది. దీంతో, బ్యాంకులు దిగుమతులకు దాదాపు నెల రోజుల పాటు బ్రేక్ చెప్పాయి. ఫలితంగా ఏప్రిల్‌లో దిగుమతులు 30 ఏళ్ల నాటి కనిష్ఠాన్ని తాకాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. క్రమంగా పెరుగుతున్న ధరలు
నష్టాల్లో సూచీలు.. 4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్