Share News

పసిడి, వెండి దిగుమతులను నిలిపివేసిన భారతీయ బ్యాంకులు!

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:50 PM

ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా భారతీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నెల మొదట్లోనే రావాల్సిన అనుమతులు ఇప్పటికీ రాలేదని తెలుస్తోంది.

పసిడి, వెండి దిగుమతులను నిలిపివేసిన భారతీయ బ్యాంకులు!
Indian Banks Halt Gold, Silver Imports

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ బ్యాంకులు పసిడి, వెండి దిగుమతులను నిలిపివేశాయి. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో దిగుమతులను నిలిపివేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగారం, వెండి దిగుమతులకు భారతీయ బ్యాంకులను అనుమతిస్తూ ఏటా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఆదేశాలు జారీ చేస్తుంది. 2025 ఏప్రిల్‌లో చివరిసారిగా ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ మొదట్లోనే మరోసారి ఆదేశాలు జారీ కావాల్సి ఉండగా ఇంకా ఎలాంటి ఆర్డర్స్ వెలువడలేదని సమాచారం. దీంతో, డీజీఎఫ్‌టీ నిర్ణయం కోసం బ్యాంకులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై డీజీఎఫ్‌టీ ఇంకా స్పందించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


బంగారం, వెండి కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే నెం.2గా ఉంది. భారత్ నుంచి డిమాండ్ తగ్గితే అంతర్జాతీయంగా కూడా లోహాల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాయి. ముడి చమురు కోసం స్పాట్ డాలర్ కొనుగోళ్లను వీలైనంతగా పరిమితం చేయాలని భారత రిఫైనరీలను ఆదేశించాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వ ఆదేశాల్లో అనిశ్చితి నేపథ్యంలో కొత్తగా బులియన్ కొనుగోళ్లకు సిద్ధం అవడం సాధ్యం కాదని కొందరు డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికే అనుమతులు లేక షిప్‌మెంట్స్ కస్టమ్స్ వద్ద నిలిచిపోయాయని అంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, 2025లో భారత్ 710 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. గత ఐదేళ్లల్లో ఇదే కనిష్ఠం.

Updated Date - Apr 17 , 2026 | 02:16 PM