Share News

వచ్చే ఏడాది వృద్ధి 6.1 శాతమే..

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:08 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైనప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మాత్రం 6.1 శాతానికి తగ్గవచ్చని ఆర్గనైజేషన్‌...

వచ్చే ఏడాది వృద్ధి 6.1 శాతమే..

ద్రవ్యోల్బణం 5.1 శాతానికి పెరగవచ్చు..

అంచనాలు విడుదల చేసిన ఓఈసీడీ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైనప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మాత్రం 6.1 శాతానికి తగ్గవచ్చని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఓఈసీడీ) అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన 6.2 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో నేరుగా పాల్గొంటున్న దేశాలు భారీగా మానవ, ఆర్థిక మూల్యం చెల్లించుకోనున్నాయని, ఈ యుద్ధం ప్రపంచ స్థితిస్థాపకతను పరీక్షించనుందని గురువారం విడుదల చేసిన నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. హోర్ముజ్‌ జలసంధి ద్వారా ఇంధనం, సరుకు రవాణా నిలిచిపోవడంతో పాటు దాడుల కారణంగా ఇంధన మౌలిక వసతులు ధ్వంసమవడం, వాటిలో ఉత్పత్తి నిలిచిపోవడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఎరువులు ఇతర కమోడిటీల సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఓఈసీడీ అంటోంది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • అమెరికా సుంకాల భారం తగ్గడం భారత వృద్ధికి మద్దతివ్వనుంది. అయినప్పటికీ, గ్యాస్‌ కొరత దేశీయంగా ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చు. ఆర్థిక సానుకూలతలూ తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు 2025-26లో 7.6 శాతం నుంచి 2026-27లో 6.1 శాతానికి తగ్గనుంది. 2027-28లో 6.4 శాతంగా నమోదు కావచ్చని అంచనా.

  • ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకవచ్చు. 2025-26లో సగటు ద్రవ్యోల్బణం 2 శాతంగా ఉండనుండగా.. 2026-27లో 5.1 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. 2027-28లో 4.1 శాతంగా నమోదు కావచ్చు.

  • మార్కెట్లో ధరాఘాత ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ (రెపో) రేటును మళ్లీ పెంచవచ్చు.

  • ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాదిలో 2.9 శాతానికి పరిమితం కావచ్చని, 2027లో 3 శాతానికి మెరుగుపడవచ్చని అంచనా.


వృద్ధికి విఘాతం.. ధరాఘాతం

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆసియా పసిఫిక్‌ ప్రాంత వృద్ధి రేటు 2026-27లో 1.3 శాతం వరకు తగ్గవచ్చని ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. అంతేకాదు, ఇంధన మార్కెట్లో అవాంతరాలు ఏడాదికి పైగా కొనసాగితే ఈ రీజియన్‌ ద్రవ్యోల్బణం 3.2 శాతం వరకు పెరగవచ్చని హెచ్చరించింది. యుద్ధంతో పెరిగిన చమురు ధరలు, సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో అవాంతరాలు ఆసియా పసిఫిక్‌లోని ఆర్థిక వ్యవస్థలపై గణనీయ ప్రభావం చూపనున్నాయని ఏడీబీ పేర్కొంది. ఈ ప్రాంత పర్యాటకం, రెమిటెన్స్‌లపైనా ప్రభావం చూపనుందని అంటోంది.

వచ్చేసారీ 7% పైనే వృద్ధి: అసోచామ్‌

భారత ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సమర్థవంతంగా, సకాలంలో చర్యలు చేపడుతోందని అసోచామ్‌ ప్రశంసించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో మన జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా, ఎగుమతుల వృద్ధి 6 శాతంగా నమోదుకావచ్చని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ నిర్మల్‌ కే మిండా అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లోనూ వృద్ధి రేటు 7 శాతం ఎగువనే నమోదు కావచ్చని అసోచామ్‌ అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు మాత్రం 3 శాతం దిగువకు పడిపోవచ్చని అంటోంది.

పొంచి ఉన్న ‘మాంద్యం’ ముప్పు

ప్రస్తుత పశ్చిమాసియా పరిస్థితులు ఆర్థికవేత్తలనూ భయపెడుతున్నాయి. ఈ యుద్ధం మరిన్ని వారాలు కొనసాగితే ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యం బారిన పడక తప్పదని సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేసే గల్ఫ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఎకనామిక్‌ రీసెర్చి విభాగం ప్రధాన ఆర్థికవేత్త జాన్‌ స్ఫకియానకిస్‌ హెచ్చరించారు. ‘పలు అసియా దేశాల వద్ద తగినంత చమురు, పెట్రో ఉత్పత్తుల నిల్వలు లేవు. ఈ యుద్ధం మరో రెండు నెలలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంస్థాగత షాక్‌లకు గురవుతుంది. ఇవన్నీ రాబోయే ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తున్నాయి’ అన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 27 , 2026 | 02:08 AM