ఫారెక్స్ మార్కెట్లో రికార్డుల హోరు
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:58 AM
మన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఫారెక్స్) మరో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ నెల 4వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 78,570.6 కోట్ల డాలర్లకు...
జీవితకాల గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
రూ.75.07 లక్షల కోట్లకు చేరిక
ముంబై: మన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఫారెక్స్) మరో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ నెల 4వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 78,570.6 కోట్ల డాలర్లకు (సుమారు రూ.75.07 లక్షల కోట్లు) చేరాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 4,490 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.29 లక్షల కోట్లు) ఎక్కువ. ఒక వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు గతంలో ఎన్నడూ ఇంతగా పెరగలేదు. పశ్చిమాసియా యుద్ధ ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన ఫారెక్స్ నిల్వలు ఈ ఏడాది జూన్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించిన ప్రత్యేక చర్యలతో మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఆర్‌బీఐ మద్దతుతో గత నెలాఖరు నాటికి బ్యాంకులు.. ప్రవాస భారతీయుల నుంచి ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్ల ద్వారా 13,600 కోట్ల డాలర్లు (సుమారు రూ.12.99 లక్షల కోట్లు) సమీకరించాయి. ఈ డిపాజిట్ల సమీకరణనే ఈ నెల 4వ తేదీతో ముగిసిన వారాంతంలో దేశ ఫారెక్స్ నిల్వలను సరికొత్త రికార్డు స్థాయికి చేర్చాయి.
భయం లేదు: బ్యాంకులు ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) పేరుతో భారీగా సేకరించిన ఫారెక్స్ డిపాజిట్లు దేశానికి భారంగా మారే ప్రమాదం ఉందన్న భయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తోసిపుచ్చారు. అలాంటి ప్రమాదమేమీ లేదన్నారు. ఈ డిపాజిట్లను ఇతర దేశాల ప్రభుత్వ రుణపత్రాల్లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఆర్‌బీఐకి మరింతగా వడ్డీ ఆదాయం లభిస్తుందన్నారు. ఈ పథకాన్ని ప్రకటించే ముందే దీనికి సంబంధించి అన్ని విషయాలను బ్యాంకులతో చర్చించినట్టు ఆయన తెలిపారు. ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్లతో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన మిగులు నిధులను ఎలా వెనక్కి తీసుకోవాలో కూడా ఆర్‌బీఐకి తెలుసని మల్హోత్రా చెప్పారు.