యుద్ధం వేళ.. ఎగుమతులు డీలా
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:56 AM
పశ్చిమాసియా యుద్ధం భారత ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది. మార్చి నెలలో భారత వస్తు ఎగుమతులు 57.95 శాతం క్షీణించాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బుధవారం తెలిపారు.
పశ్చిమాసియాకు ఎగుమతుల్లో 58శాతం క్షీణత
మొత్తం ఎగుమతులు 7.44 శాతం డౌన్
దిగుమతులదీ అదే పరిస్థితి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం భారత ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది. మార్చి నెలలో భారత వస్తు ఎగుమతులు 57.95 శాతం క్షీణించాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బుధవారం తెలిపారు. భారత్ సాధారణంగా పశ్చిమాసియాకు ప్రతీ నెలా 600 కోట్ల డాలర్ల (రూ.55,800 కోట్లు) విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుందని, యుద్ధం కారణంగా మార్చిలో ఇవి 350 కోట్ల డాలర్ల (రూ.32,550 కోట్లు) మేర తగ్గి 250 డాలర్ల (రూ.23,250 కోట్లు) స్థాయికి పరిమితమైనట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా జెమ్స్ అండ్ జువెలరీ, ఎలకా్ట్రనిక్స్, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, బియ్యం ఎగుమతులపై అధిక ప్రభావం పడిందన్నారు. అంతేకాదు, పశ్చిమాసియా నుంచి భారత్‌కు దిగుమతులు సైతం 51.64 శాతం తగ్గాయన్నారు.
9 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు
కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో మొత్తం ఎగుమతులు కూడా వార్షిక ప్రాతిపదికన 7.44 శాతం తగ్గి 3,892 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.62 లక్షల కోట్లు) పడిపోయాయి. దిగుమతులు కూడా 6.51 శాతం తగ్గుదలతో 5,959 కోట్ల డాలర్లకు (రూ.5.54 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి. ముడిచమురు, పసిడి దిగుమతులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. వాణిజ్య లోటు 9 నెలల కనిష్ఠ స్థాయిలో 2,067 కోట్ల డాలర్లుగా (రూ.1.92 లక్షల కోట్లు) నమోదైంది.
భారీగా తగ్గిన చమురు, బంగారం దిగుమతులు
గత నెలలో ముడి చమురు దిగుమతులు 35.91 శాతం తగ్గి 1,218 కోట్ల డాలర్లకు (రూ.1.13 లక్షల కోట్లు) జారుకోగా.. పసిడి దిగుమతులు కూడా 31.63 శాతం తగ్గుదలతో 306 కోట్ల డాలర్లకు (రూ.28,458 కోట్లు) పరిమితమైనట్లు కేంద్రం తెలిపింది.
భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా
గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాను వెనక్కి నెట్టి భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా చైనా అవతరించింది. 2025-26లో భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15,110 కోట్ల డాలర్లకు (రూ.14.05 లక్షల కోట్లు) పెరిగింది. చైనాకు భారత ఎగుమతులు 36.66 శాతం పెరిగి 1,947 కోట్ల డాలర్లకు (రూ.1.81 లక్షల కోట్లు) చేరగా.. చైనా నుంచి భారత్‌కు దిగుమతులు కూడా 16 శాతం పెరిగి 13,163 కోట్ల డాలర్లకు (రూ.12.24 లక్షల కోట్లు) ఎగబాకాయి. దాంతో చైనాతో భారత్ వాణిజ్య లోటు కూడా 11,216 కోట్ల డాలర్లకు (రూ.10.43 లక్షల కోట్లు) పెరిగింది.
ఏడాది ఎగుమతుల్లో రికార్డు-రూ.80 లక్షల కోట్లు
ఈ మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్స రం మొత్తానికి వస్తు, సేవల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 4.22 శాతం వృద్ధితో ఆల్‌టైం రికార్డు స్థాయి 86,009 కోట్ల డాలర్లకు (రూ.79.99 లక్షల కోట్లు) పెరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. అందులో వస్తు ఎగుమతు లు ఒక శాతం పెరుగుదలతో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 44,178 కోట్ల డాలర్లకు (రూ.41.09 లక్షల కోట్లు) చేరగా, సేవల ఎగుమతులు 41,831 కోట్ల డాలర్లుగా (రూ.38.90 లక్షల కోట్లు) నమోదయ్యాయి. కాగా, 2025-26లో వస్తు దిగుమతులు 7.45 శాతం పెరుగుదలతో 77,498 కోట్ల డాలర్లకు (రూ.72.07 లక్షల కోట్లు) చేరాయి. దాంతో వాణిజ్య లోటు 33,320 కోట్ల డాలర్లుగా (రూ.30.99 లక్షల కోట్లు) నమోదైంది. ట్రంప్ సుంకాలు, పశ్చిమాసియా యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరం ఎగుమతి వాణిజ్యంలో భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని రాజేశ్ అగర్వాల్ అన్నారు.