Share News

రూ.41.28 లక్షల కోట్లు

ABN , Publish Date - Oct 03 , 2026 | 02:11 AM

గత ఏడాది నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టుల మొత్తం విలువ 43,000 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.41.28 లక్షల కోట్లు)గా నమోదైంది.

రూ.41.28 లక్షల కోట్లు
HOUSING

  • గత ఏడాది నిర్మాణంలో ఉన్న

గృహ ప్రాజెక్టుల విలువ ఇది..

  • క్రెడాయ్‌- అనరాక్‌ నివేదిక వెల్లడి

కోల్‌కతా: గత ఏడాది నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టుల మొత్తం విలువ 43,000 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.41.28 లక్షల కోట్లు)గా నమోదైంది. 2019లో నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టుల మొత్తం విలువ 23,500 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. 2009లో ఈ విలువ కేవలం 4,500 కోట్ల డాలర్లుగా నమోదైంది. స్థిరాస్తి రంగ సమాఖ్య క్రెడాయ్‌, ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ అనరాక్‌ సంయుక్తంగా శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత గృహాలకు డిమాండ్‌ పెరగడంతో రెసిడెన్షియల్‌ రియల్టీ మార్కెట్లో నిర్మాణ కార్యకలాపాలు వేగంగా పెరిగాయని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విషయాలు..

2025లో నిర్మాణంలో ఉన్న గృహ, కార్యాలయ, రిటైల్‌, గిడ్డంగుల ప్రాజెక్టుల మొత్తం విలువ 50,300 కోట్ల డాలర్లుగా (రూ.48.29 లక్షల కోట్లు) నమోదైంది. 2009లో నమోదైన 9,400 కోట్ల డాలర్లతో పోలిస్తే ఐదింతలకు పైగా పెరిగింది. అలాగే, ఇందులో గృహ ప్రాజెక్టుల వాటా సమీక్షా కాలంలో 48ు నుంచి 85 శాతానికి పెరిగింది.

గత ఏడాది నిర్మాణంలో ఉన్న ఆఫీస్‌ రియల్టీ ప్రాజెక్టుల మొత్తం విలువ 1,000 కోట్ల డాలర్లు (రూ.96,000 కోట్లు). కాగా 2009లో ఇది దాదాపు సున్నాగా ఉంది. వాణిజ్య రియల్టీ మార్కెట్లో ఇదే అతిపెద్ద విభాగం.


4 వరకు నాట్కాన్‌ సదస్సు

క్రెడాయ్‌ కోల్‌కతాలో మూడు రోజుల నాట్కాన్‌ సదస్సును శుక్రవారం ప్రారంభించింది. 4వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో 1,000 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు పాల్గొంటున్నారు. క్రెడాయ్‌లో 13,000 మందికి పైగా సభ్యులున్నారు.

అధిక నిర్మాణ వ్యయం, పన్నులతోనే

అందుబాటు గృహాలను నిర్మించలేకపోతున్నాం

నిర్మాణం వ్యయం భారీగా పెరగడంతో పాటు అధిక పన్నుల కారణంగానే బిల్డర్లు అందుబాటు ధరల్లో గృహ ప్రాజెక్టులను నిర్మించలేకపోతున్నారని క్రెడాయ్‌ అంటోంది. మార్కెట్లో అందుబాటు ధరల గృహాల లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని అసోసియేషన్‌ కోరింది.

రూ.1.3 లక్షల కోట్లకు పైగా గృహ విక్రయాలు

ఈ ఏడాది పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ భారత రియల్టీ మార్కెట్‌ తట్టుకొని నిలబడగలిగింది. వరుసగా 13 త్రైమాసికాలుగా గృహ విక్రయాల విలువ రూ.1.3 లక్షల కోట్ల ఎగువన నమోదైంది. గ్రేడ్‌ ఏ కార్యాలయాల లీజులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో నమోదైన మొత్తం లీజుల్లో 45 శాతం వాటా గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లదే.

- అనూజ్‌ పురి, చైర్మన్‌,అనరాక్‌

రూ.57.60 లక్షల కోట్లకు రియల్టీ మార్కెట్‌

రియల్టీ రంగ ప్రయాణం దేశ అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. 2017లో 12,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న రియల్టీ మార్కెట్‌ ప్రస్తుతం 60,000 కోట్ల డాలర్లకు చేరుకుందని అంచనా. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లకు, 2027 నాటికి దాదాపు 5.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా.

- శేఖర్‌ పటేల్‌,జాతీయ అధ్యక్షులు, క్రెడాయ్‌

Updated Date - Oct 03 , 2026 | 02:12 AM