హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.5,132 కోట్లు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:01 AM
ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.5,132 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది.
రెండో త్రైమాసికంలో 21 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.5,132 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.4,235 కోట్ల నికర లాభంతో పోల్చితే 21.18శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి కంపెనీ రాబడి 11.5శాతంపెరిగి రూ.31,942 కోట్ల నుంచి రూ.35,620 కోట్లకు చేరుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న అడ్వాన్స్‌డ్ ఏఐ కార్యకలాపాల ద్వారా లభించిన అధిక మార్జిన్లు, తక్కువ పన్ను భారం కంపెనీకి కలిసివచ్చింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాబడిలో వృద్ధి అంచనాను 1-4 శాతం నుంచి 2.5-4 శాతానికి సవరించింది. బలమైన బుకింగ్స్, ఆశాజనకమైన డీల్స్, ఏఐ ఆధారిత సేవల్లో జోరు కారణంగా ఈ అంచనాకు వచ్చినట్టు కంపెనీ సీఈఓ, ఎండీ విజయకుమార్ తెలిపారు.
6,136 మంది ఫ్రెషర్ల నియామకం: కంపెనీ ఫ్రెషర్ల నియామకాలపై దృష్టిసారిస్తోంది. సెప్టెంబరు త్రైమాసికంలో 6,450 మందిని నియమించుకుంది. ఇందులో ఫ్రెషర్లు 6,136 మంది ఉన్నారు. క్రితం త్రైమాసికంలో వీరి సంఖ్య 1,056 మాత్రమే ఉంది. 2025-26 రెండో త్రైమాసికంలో నియమించుకున్న 5,196 మంది ఉద్యోగులకన్నా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నియమించుకున్న ఫ్రెషర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. ఇక కంపెనీలో వలసల రేటు రెండో త్రైమాసికంలో గత పన్నెండు నెలల ప్రాతిపదికన 12.8 శాతానికి చేరింది. క్రితం త్రైమాసికంలో ఇది 12.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ భావిస్తోంది. వార్షిక వేతన పెంపు అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరాజన్ తెలిపారు.
ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం: ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ క్లయింట్ల కోసం క్లాడ్‌ను ఉపయోగించి ఏజెంటిక్ ఏఐ సొల్యూషన్లను రూపొందించేందుకుగాను ఒక ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.