Share News

అరెస్ట్‌ అధికారాలకు కత్తెర

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:32 AM

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రక్రియ మరింత సులభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన జీఎస్‌టీ మండలి 57వ సమావేశం అనేక సంస్కరణలకు ఆమోదం తెలిపింది.

అరెస్ట్‌ అధికారాలకు కత్తెర
nirmalaseetharaman

  • రిఫండ్స్‌, రిజిస్ట్రేషన్లు మరింత సులభం జీఎస్‌టీ ప్రక్రియలో కీలక సంస్కరణలు

  • రేట్లు మాత్రం యథాతథం బకాయిలు రూ.10,000 మించితేనే డిమాండ్‌ నోటీసులు

న్యూఢిల్లీ: సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రక్రియ మరింత సులభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన జీఎస్‌టీ మండలి 57వ సమావేశం అనేక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీతారామన్‌ చెప్పారు. ఈ సమావేశంలో వినియోగదారులకు మేలు చేసే ఎలాంటి పన్ను కోత నిర్ణయాలను జీఎస్‌టీ మండలి తీసుకోలేదు. అయితే కంపెనీలకు మేలు చేసే అనేక నిర్ణయాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.10,000 లోపు పన్ను బకాయిలకు ఇక పన్ను డిమాండ్‌ నోటీసులు జారీ చేయకూడదని నిర్ణయించింది. ప్రాసిక్యూషన్‌ పన్ను బకాయిల పరిమితినీ ప్రస్తుత రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. అలాగే జీఎస్‌టీ అధికారులు చేసే అరెస్టుల అధికారాలకు చెక్‌ పెడుతూ జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

ఐటీసీ విస్తరణ: ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పరిమితిని మరింత విస్తృతం చేసేందుకు జీఎ్‌సటీ మండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై చెల్లించే ప్రీమియంపై ఐటీసీ క్లెయిమ్‌ చేసుకునేందుకు కంపెనీలను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య, జీవిత బీమాలపై మరింతగా దృష్టి పెడతాయని భావిస్తున్నారు. టెలికాం టవర్ల ఏర్పా టు కోసం చేసే ఖర్చుల పైనా టెలికాం కంపెనీలకు ఇక ఐటీసీ లభించనుంది. కాలం తీరిన ఉత్పత్తుల నిల్వల రైటాఫ్‌ మీద కూడా కంపెనీలు ఐటీసీ క్లెయిమ్‌ చేసుకోవచ్చని నిర్మల సీతారామన్‌ చెప్పారు.


సేవల రంగానికి ఊరట: సేవల రంగానికి జీఎస్‌టీ మండలి పెద్ద ఊరట కల్పించింది. ముఖ్యంగా రూ.7,500 వరకు ఉండే సేవలను కొని, తిరిగి అమ్మే వ్యాపార సంస్థలు ఐటీసీ క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుమతించింది. దీంతో ఏజెంట్లు, రెస్టారెంట్లు, కేటరింగ్‌ పరిశ్రమ, ట్రావెల్‌ పరిశ్రమ బాగా లబ్ది పొందనున్నాయి.

రిఫండ్స్‌: జీఎస్‌టీ రిఫండ్స్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రిఫండ్‌ క్లెయిమ్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ గడువు 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గనుంది. ఈలోగా అక్‌నాలెడ్జ్‌మెంట్‌ అందకపోయినా, జారీ చేసిన మెమోలో లోపా లు ఉన్నా జీఎస్‌టీ అధికారులు రిఫండ్‌ క్లెయిమ్‌ను అక్‌నాలెడ్జ్‌ చేసినట్టుగా పరిగణిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ: వ్యాపార సంస్థల జీఎస్‌టీ నమోదు (రిజిస్ట్రేషన్‌), సవరణ ప్రక్రియను ఆటోమేషన్‌ చేసేందుకూ మండలి ఆమో దం తెలిపింది. ప్రస్తుతం పెద్దగా రిస్క్‌ లేని వ్యాపార సంస్థల జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌, సవరణల ప్రక్రియకు మూడు పనిదినాలు పడుతోంది. ఇప్పుడు ఆటోమేషన్‌తో అధికారుల ప్రమేయం లేకుండానే ఇది త్వరగా పూర్తి కానుంది.

బ్యాంకుల పసిడి దిగుమతులపైనా జీఎస్‌టీ

పసిడి, వెండి, ప్లాటినం దిగుమతులపై ఇప్పటి వరకు బ్యాంకులు, నామినేటెడ్‌ ఏజెన్సీలకు ఉన్న జీఎస్‌టీ మినహాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థల దిగుమతులపైనా 3 శాతం జీఎస్‌టీ విధిస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు చెప్పారు.


వడ్డీ, జరిమానాల అధికారం యథాతథం

జీఎస్‌టీ అధికారుల ఆగడాలకీ జీఎస్‌టీ మండలి తెరదించింది. సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్‌ 69 కింద దర్యాప్తు దశలో ఉన్న కొన్ని అనుమానిత కేసుల్లో.. కమిషనర్‌ స్థాయి అధికారికి ఉన్న అరెస్టు అధికారాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో వ్యక్తిగత స్వేచ్ఛను పన్ను వసూ ళ్ల నుంచి పూర్తిగా వేరు చేసినట్టయింది. అరెస్టు అధికారాన్ని రద్దు చేసినా,జీఎస్‌టీ అధికారులకు ప్రస్తుతం ఉన్న పన్ను మదింపు, పన్ను రికవరీ, ఆలస్యంగా చెల్లించే పన్నులపై వడ్డీ, పెనాల్టీలు విధించే అధికారాలు మాత్రం యథాతథంగానే ఉంటాయని జీఎస్‌టీ మండలి స్పష్టం చేసింది. కాగా జీఎస్‌టీ అధికారులు ఇక వస్తువుల వాహనం బయలుదేరిన స్థానం, గమ్య స్థానం ఉండే రాష్ట్రాల్లో తప్ప, వాహనాలను ఎక్కడా తనిఖీ చేయడానికి వీల్లేదు. అదికూడా స్పష్టమైన సమాచారం ఉంటే తప్ప.. వీరు ఆ వాహనాలను తనిఖీ చేసేందుకు వీల్లేదు. దీంతో వచ్చినా మధ్యలోనే తనిఖీల పేరుతో వాహనాలను అడ్డుకుని దండుకుంటున్న అవినీతి అధికారుల ఆగడాలకు చెక్‌ పడుతుందని భావిస్తున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 01:37 AM