జీఎస్‌టీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ ఎలా లెక్కించాలి?
ABN , Publish Date - May 24 , 2026 | 03:28 AM
వస్తు సేవల పన్నుల్లో సకాలంలో పన్ను చెల్లించకుంటే, సదరు పన్ను మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. పన్ను చెల్లింపునకు సాధారణంగా బ్యాలెన్స్‌లో ఉన్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్...
వస్తు సేవల పన్నుల్లో సకాలంలో పన్ను చెల్లించకుంటే, సదరు పన్ను మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. పన్ను చెల్లింపునకు సాధారణంగా బ్యాలెన్స్‌లో ఉన్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను వాడుతుంటారు. ఒకవేళ క్రెడిట్ బ్యాలెన్స్ సరిపోను లేనప్పుడు నగదు ద్వారా చెల్లింపులు చేస్తారు. ఒక్కొక్కసారి పన్ను చెల్లింపునకు సరిపోను ఐటీసీ ఉన్నప్పటికీ ఏదేనీ కారణంతో పన్ను చెల్లింపు ఆలస్యం కావచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా అంటే సరిపడా ఐటీసీ ఉన్నప్పటికీ వడ్డీ కట్టడం అనేది పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలిగించే విషయం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంబంధిత సెక్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం ఐటీసీ ద్వారా చెల్లించిన పన్ను మీద, ఆలస్యానికి సంబంధించి అంటే లేట్ పేమెంట్ మీద ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేదు. అంటే కేవలం నగదు రూపంలో చెల్లించే పన్ను మీద మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
వడ్డీ మినహాయింపు ఎప్పుడంటే: ఒక నెలలో చేపట్టిన అమ్మకాలు లేదా సరఫరాలకు సంబంధించిన వివరాలు ఆ నెలకు సంబంధించిన రిటర్న్‌లో కచ్చితంగా చూపించాలి. అప్పుడు మాత్రమే ఆ రిటర్న్ నిర్ణీత సమయం తర్వాత దాఖలు చేసినప్పటికీ అంటే పన్ను చెల్లింపు ఆలస్యమైనప్పటికీ.. ఐటీసీ ద్వారా చెల్లించిన పన్ను మేర వడ్డీ మినహాయింపు లభిస్తుంది. అంటే నగదు చెల్లింపుల ద్వారా చేపట్టిన పన్ను చెల్లింపులకు మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు జనవరి నెలలో ఒక రూ.లక్ష అమ్మకాలు చేపట్టాడు. అందుకు గాను రూ.12,000 పన్ను చెల్లించాలనుకుందాం. ఈ రూ.12,000కు గాను తన దగ్గర రూ.14,000 ఐటీసీ ఉంది. పన్ను చెల్లింపు మొత్తానికి ఐటీసీ సరిపోతుంది కాబట్టి నగదులో ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు. అయితే జనవరి నెల రిటర్న్ సకాలంలో వేయకుండా 6 నెలల తర్వాత వేశాడనుకుందాం.
అప్పుడు ఆ రిటర్న్‌లో జనవరిలో చేపట్టిన రూ.లక్ష అమ్మకాలు మొత్తం చూపించి దానికి సంబంధించిన పన్ను.. నగదు ఉపయోగించకుండా ఐటీసీ బ్యాలెన్స్ ద్వారా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ కట్టనవసరం లేదు. అలా కాకుండా అదే జనవరి రిటర్న్ సకాలంలో వేసి రూ.లక్షకు గాను రూ.60,000 అమ్మకాలు మాత్రమే చూపించి మిగతా రూ.40,000 అమ్మకాలు ఫిబ్రవరి నెల రిటర్న్‌లో కలిపి చూపితే ఐటీసీ సరిపోను ఉన్నప్పటికీ ఆ రూ.40,000కు వడ్డీ మినహాయింపు రాదు. అంటే పన్ను చెల్లింపు ఆలస్యమైనప్పటికీ సంబంధిత రిటర్న్ ఏ పీరియడ్‌కు అయితే దాఖలు చేస్తున్నారో.. ఆ పీరియడ్‌లో జరిపిన సరఫరా వివరాలు అన్ని చూపించి పన్ను చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు మాత్రమే ఐటీసీ ద్వారా చేపట్టిన చెల్లింపునకు వడ్డీ మినహాయింపు లభిస్తుంది.
చర్యలు తీసుకోవచ్చు: ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, సకాలంలో పన్ను చెల్లించనందుకు లేదా రిటర్న్‌లు దాఖలు చేయనందుకు లేదా జీఎస్‌టీ చట్టాలకు సంబంధించిన ఇతర ఉల్లంఘనలకు గాను అధికారులు అప్పటికే తగు చర్యలు తీసుకోవచ్చు. ఈ చర్యలు తీసుకున్న తర్వాత దాఖలు చేసే రిటర్న్‌లకు వడ్డీకి సంబంధించిన మినహాయింపు పొందలేరు. అంటే అలాంటప్పుడు నగదు ద్వారా చెల్లించిన పన్నుకు మాత్రమే కాకుండా మొత్తం పన్ను మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక్కోసారి ఐటీసీ సరిపోను ఉన్నప్పటికీ పన్ను చెల్లింపునకు లేదా అడ్జ్‌స్టమెంట్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం లేదా ఏదేనీ ఇతర కారణాలతో నగదులో చెల్లింపులు చేపట్టాల్సి రావచ్చు. అలాంటప్పుడు కూడా నగదు చెల్లింపు మీద వడ్డీ చెల్లించాలి.
సులభంగా అర్ధం కావాలంటే.. ఐటీసీ ఎంత ఉన్నది అన్న దానికంటే చెల్లింపు ఎలా చేపట్టామనేది ముఖ్యం. పైన చెప్పిన నిబంధనలు పాటించినప్పుడు ఐటీసీ ద్వారా చెల్లించిన పన్నుకు వడ్డీ మినహాయింపు పొందవచ్చు. తద్వారా నగదు చెల్లింపు మీద మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అయితే, రిటర్న్ దాఖలు గడువు తేదీ నాటికే నగదు రిజిస్టర్‌లో కొంత మొత్తం ఉండి, ఆ మొత్తాన్ని పన్ను చెల్లింపునకు వాడినా ఆ మొత్తం మీద కూడా వడ్డీ మినహాయింపు లభిస్తుంది. అంటే, పైన చెప్పిన జనవరి ఉదాహరణ తీసుకుంటే.. రిటర్న్ గడువు తేదీ ఫిబ్రవరి 20 నాటికే కొంత మొత్తం నగదు రిజిస్టర్ ఉంటే అప్పుడు రిటర్న్ దాఖలు చేయటం ఆలస్యమైనప్పటికీ ఆ మేర వడ్డీ మినహాయింపు లభిస్తుంది (పైన తెలిపిన నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే).