Share News

జీఎస్‌టీ పదేళ్లు

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:07 AM

మన దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

జీఎస్‌టీ పదేళ్లు

  • ఏఐ, డేటా షేరింగ్‌, పన్ను ప్రక్రియల సరళీకరణపై దృష్టి

  • 66.5 లక్షల నుంచి 1.6 కోట్లకు పన్ను చెల్లింపుదారులు

  • పెరుగుతున్న జీఎస్‌టీ రాబడులు

న్యూఢిల్లీ: మన దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దేశంలో అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణల్లో ఒకటిగా నిలిచిన జీఎస్‌టీ 2017 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పన్ను వ్యవస్థ అమలు దశ నుంచి సామర్థ్యం పెంపు దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ), డేటా షేరింగ్‌, ప్రక్రియల సరళీకరణ ద్వారా వ్యయాలను తగ్గించడం, రిఫండ్‌లను వేగవంతం చేయడం, పన్ను ఎగవేతల కట్టడి చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) నిబంధనలను పాటించడాన్ని సులభతరం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞాన్ని ఎక్కువగా ఉపయోగిస్తోంది.

అలాగే రిస్క్‌ అసెస్‌‌మెంట్‌ను మెరుగుపరచడానికి, పన్ను ఎగవేతలను అరికట్టడానికి, మానవ ప్రమేయాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జీఎస్‌టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్‌ డేటా బేస్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తోంది. దేశంలో జీఎస్‌టీ అమలు పన్ను పరిధిని విస్తరించేందుకు దోహదపడింది. అలాగే నిబంధనలను పాటించడం మెరుగైంది. ఫలితంగా ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది. ఇంతకు ముందున్న 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు, 13 రకాల సెస్సులను రద్దు చేసి వాటన్నింటి స్థానంలో ఏకీకృత పరోక్ష పన్నుల విధానాన్ని జీఎస్‌టీ ద్వారా తీసుకువచ్చారు. అన్ని వస్తుసేవలపై దేశమంతటా ఒకేలా విధించే పరోక్ష పన్నే వస్తుసేవల పన్ను. దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్‌ను సృష్టించడం, పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడమే లక్ష్యం గా దీన్ని తెచ్చారు. జీఎస్‌టీ ప్రారంభించిన సమయంలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 66.5 లక్షలు ఉండేది. 2026 సంవత్సరంలో ఈ సంఖ్య దాదాపు 1.6 కోట్లకు చేరుకుంది.


రేట్ల హేతుబద్ధీకరణ

మొదట జీఎస్‌టీని నాలుగు శ్లాబు రేట్లలో ప్రవేశ పెట్టారు. అప్పుడు 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం పన్ను రేట్లు ఉండేవి. కాలక్రమేణా జీఎస్‌టీ ఆదాయాలు స్థిరపడటం, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతో పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. దీంతో 2025 సెప్టెంబరు 22 నుంచి రెండు శ్లాబులతో కూడిన జీఎస్‌టీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువులకు 5ు, సాధారణ వస్తుసేవలకు 18శాతం పన్నును విధిస్తున్నారు. అలాగే విలాసవంతమైన, హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40శాతం శ్లాబును తీసుకువచ్చారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ఫలితంగా చాలా వస్తువుల ధరలు దిగివచ్చాయి. పన్నుల భారం తగ్గడంతో ప్రజల పొదుపు పెరగడానికి అవకాశం ఏర్పడింది.

రాబడుల్లో జోరు..

జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన 2017-18 సంవత్సరం లో సగటు నెలవారీ ఆదాయం రూ.89,700 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2025-26లో ఈ వసూళ్లు రూ.1.85 లక్షల కోట్లకు ఎగబాకాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్‌టీ రాబడి వార్షిక ప్రాతిపదికన 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లకు చేరుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 9.4 శాతం వృద్ధితో రూ.22.08 లక్షల కోట్లుగా నమోదైంది.

Updated Date - Jun 29 , 2026 | 04:07 AM