గూగుల్ నిధుల సమీకరణ.. 100 ఏళ్ల కాల పరిమితితో బాండ్స్ జారీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 08:40 PM
గూగుల్ నిధుల సమీకరణకు దిగింది. ఈ దిశగా 100 ఏళ్ల కాలపరిమితిపై బాండ్స్ జారీ చేయడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ సంస్థ 1998లో ఏర్పాటైంది. ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికిన సంస్థల్లో ఒకటైన గూగుల్ ఈ ఏఐ యుగంలో కూడా దూసుకుపోతోంది. ఈ రంగంపై పట్టుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇందుకోసం భారీస్థాయిలో నిధులను కూడా సమీకరిస్తోంది. ఈ దిశగా 100 ఏళ్ల కాలపరిమితి గల బాండ్స్‌ను సంస్థ తాజాగా జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బ్లూమ్‌బర్గ్ సంస్థ కథనం ప్రకారం, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫబెట్ డాలర్ సహా వివిధ కరెన్సీల్లో నిధులను సమీకరిస్తోంది. మొత్తం 20 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా 100 ఏళ్ల కాలపరిమితి గల బాండ్స్‌ను కూడా ఆల్ఫబెట్ జారీ చేసిందట. ఏఐపై పెట్టుబడుల కోసమే ఈ స్థాయిలో సంస్థ నిధులను సమీకరిస్తోందట. ఏఐ కోసం మొత్తం 185 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించేందుకు సంస్థ నిర్ణయించింది. ఏఐ సాంకేతికతపై సంస్థకు ఉన్న విశ్వాసానికి ఈ నిధుల సమీకరణ ఓ నిదర్శనమని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సాంకేతిక రంగంలో ఏఐ విప్లవం మునుపెన్నడూ చూడనిదని అనేక టెక్ సంస్థలు బలంగా విశ్వసిస్తున్నాయి. సమాజాన్ని సమూలంగా మార్చడంతో పాటు ఏఐని నియంత్రించ గలిగిన వారిపై కనకవర్షం తప్పదని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు భారీ స్థాయిలో ఏఐపై పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి. గూగుల్‌తో పాటు మెటా, అమెజాన్, వంటి సంస్థలు ఈ ఏడాది మొత్తం 660 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.