Share News

బులియన్‌లో దిద్దుబాటు తాత్కాలికమే

ABN , Publish Date - Jun 28 , 2026 | 02:40 AM

బులియన్‌ మార్కెట్‌ ఈ ఏడాది జనవరి వరకు రేసు గుర్రంలా పరుగెత్తింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31 గ్రాములు) మేలిమి పసిడి ధర రికార్డు స్థాయిలో....

బులియన్‌లో దిద్దుబాటు తాత్కాలికమే

బులియన్‌ మార్కెట్‌ ఈ ఏడాది జనవరి వరకు రేసు గుర్రంలా పరుగెత్తింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31 గ్రాములు) మేలిమి పసిడి ధర రికార్డు స్థాయిలో 5,400 డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. మన దేశ రిటైల్‌ మార్కెట్లోనూ రూ.1.75 లక్షలు, ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లో రూ.1.93 లక్షలకు చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. ఫిబ్రవరి నుంచి దిద్దుబాటు (కరెక్షన్‌)కు లోనై ఇప్పుడు స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంటే గత ఐదు నెలల్లోనే పసిడి ధర దేశీయ మార్కెట్లో 20 శాతం దిద్దుబాటుకు లోనైంది. దీన్ని పశ్చిమాసియా సంక్షోభంతో ఏర్పడిన తాత్కాలిక బ్రేక్‌గా చూడాలే తప్ప.. భయం లేదా ఊహాగానాలతో ఏర్పడిన దీర్ఘకాలిక అడ్డంకిగా చూడకూడదు.

అమెరికా ఆంక్షలతోనే ర్యాలీ

నిజానికి 2022 వరకు పసిడి ధర అందుబాటులోనే ఉంది. అమెరికా ఎప్పుడైతే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించి ఆ దేశానికి చెందిన దాదాపు 30,000 కోట్ల డాలర్ల నిధులను స్థంభింపచేసిందో అప్పటి నుంచి పసిడికి రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలకు చెందిన కేంద్ర బాం్యకులు పెద్దఎత్తున తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్లను తగ్గించి, బంగారం కొనడం ప్రారంభించాయి. దీంతో గత ఏడాది చివరికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడి నిల్వలు 36,000 టన్నులకు చేరాయి. ఒక్క ఏడాది కాలంలోనే ప్రపంచ కేంద్ర బ్యాంకుల ఫారెక్స్‌ నిల్వల్లో పసిడి వాటా 20 నుంచి 27 శాతానికి పెరిగిపోయంది. మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇరాన్‌ యుద్ధంతో బ్రేక్‌

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రారంభించిన దాడులతో కేంద్ర బ్యాంకులు బంగారం కొనడం తగ్గించాయి. తుర్కియే కేంద్ర బ్యాంకు అయితే తన కరెన్సీ లీరా పతనాన్ని అడ్డుకునేందుకు రాత్రికి రాత్రి 131 టన్నుల బంగారాన్ని అమ్మి 2,000 కోట్ల డాలర్లు సమీకరించింది. భారత్‌, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు ఆపి, ఆ మొత్తాన్ని చమురు దిగుమతులకు మళ్లించాయి. ఇదే సమయంలో ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం విలువ పుంజుకుంది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌.. వడ్డీ రేట్లు పెంచనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో మార్చి వరకు కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్ల జోలికి పోలేదు. ఏప్రిల్‌లో మాత్రమే కేంద్ర బ్యాంకుల కొద్ది స్థాయిలో అంటే 19 టన్నుల పసిడి కొనుగోలు చేశాయి. దాంతో ధరల పతనం కొనసాగింది. ఈ సమయంలోనూ చైనా, పోలెండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ల కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోళ్లు కొనసాగించడం విశేషం.


పసిడి మరో10శాతం తగ్గొచ్చు..

అమెరికా కేంద్ర బ్యాంక్‌.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో రెండు విడతలుగా వడ్డీ రేట్లు పెంచుతుందని అంచనా. అదే జరిగితే డాలర్‌ మారకం రేటు మరింత బలపడి, పసిడి ధర 8 నుంచి 10 శాతం దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అప్పటి నుంచి కేంద్ర బ్యాంకులు మళ్లీ పసిడి కొనుగోళ్లకు దిగే అవకాశం ఉంది.

భవిష్యత్తు

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో కిలో వెండి ధర రూ.3.25 లక్షల నుంచి రూ.3.5 లక్షల మధ్య పలికే అవకాశం ఉంది. కాకపోతే ఇందుకోసం వచ్చే రెండు మూడు నెలల్లో కిలో వెండిని రూ.2.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల మధ్య కొనుగోలు చేయాలి. బంగారం ధర కూడా రూ.1.35 లక్షల నుంచి రూ.1.45 లక్షల మధ్య ట్రేడైనప్పుడు కొంటే వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో రూ.1.5 లక్షల నుంచి రూ.2.08 లక్షల వరకు ఎగబాకే అవకాశం ఉంది. అయితే ఇదంతా అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌.. వడ్డీ రేట్లు, ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటుపై ఆధారపడి ఉంటుంది.

వెండిదీ అదే బాట

ఈ ఏడాది జనవరి 28న ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.4,20,934కు చేరింది. ప్రస్తుతం కిలో రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంటే జనవరితో పోలిస్తే ప్రస్తుతం వెండి ధర దాదాపు 53 శాతం దిద్దుబాటుకు లోనైంది. పసిడితో పోలిస్తే వెండికి గిరాకీ ఎక్కువ. నగల తయారీతో పాటు సోలార్‌ ప్యానెల్స్‌, ఈవీలు, ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. దీంతో ప్రస్తుతం వెండి సరఫరా-గిరాకీ మధ్య ఏటా 4.63 కోట్ల ఔన్స్‌ల వ్యత్యాసం ఉంది.

Updated Date - Jun 28 , 2026 | 02:40 AM