Share News

పసిడి రుణ గ్రహీతలు ముఖం చాటేస్తున్నారు..!

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:53 AM

గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌ తడబడుతోంది. పసిడి హామీపై ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు తిప్పలు పడుతున్నాయి.

పసిడి రుణ గ్రహీతలు ముఖం చాటేస్తున్నారు..!

  • రుణం తిరిగి చెల్లింపుల్లో పెరుగుతున్న వైఫల్యాలు

న్యూఢిల్లీ: గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌ తడబడుతోంది. పసిడి హామీపై ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు తిప్పలు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ రుణాల తిరిగి చెల్లింపుల వైఫల్యం మరీ ఆందోళనకర స్థాయిలో లేదు. అయినప్పటికీ, ఈ సెక్యూర్డ్‌ లోన్స్‌ మార్కెట్‌లో పొంచి ఉన్న సంక్షోభానికి దీన్ని ఒక సంకేతంగా భావిస్తున్నారు. సమస్య గుదిబండగా మారక ముందే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు జాగ్రత్త పడుతున్నాయి. గోల్డ్‌ లోన్ల బకాయిల చెల్లింపుల్లో విఫలమైన కస్టమర్లకు పిరామల్‌ ఫైనాన్స్‌ కొత్త రుణాలివ్వడం లేదు. బజాజ్‌ ఫైనాన్స్‌ స్వల్పకాలిక గోల్డ్‌ లోన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రూ.5.6 లక్షల కోట్ల రుణాల జారీ

గత ఏడాది పసిడి, వెండి ధరలు కొండెక్కాయి. ఈ ఏడాది జనవరి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఎడాపెడా బంగారం రుణాలిచ్చాయి. కొన్ని ఎన్‌బీఎ్‌ఫసీలైతే నిబఽంధనలు పక్కన పెట్టి, పసిడి మార్కెట్‌ రేటులో 85 శాతం వరకు రుణంగా ఇచ్చాయి. రుణగ్రహీత చెల్లింపుల్లో విఫలమైనా తమ వద్ద హామీగా పెట్టిన బంగారాన్ని వేలం వేసి మరీ రాబట్టుకోవచ్చనే ఎన్‌బీఎ్‌ఫసీల నమ్మకం ఇందుకు బాగా దోహదం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి బ్యాంకులు మంజూరు చేసిన పసిడి రుణాలు రూ.5.6 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 83 శాతం ఎక్కువ. ఎన్‌బీఎ్‌ఫసీలూ ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికి రూ.3.6 లక్షల కోట్లు పసిడి రుణాలుగా ఇచ్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 69 శాతం ఎక్కువ. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్‌ రుణాల్లో పసిడి రుణాల వాటా మూడో వంతు వరకు ఉన్నట్టు ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది.


ధరల పతనంతో తిప్పలు షురూ

ఈ జనవరిలో నమోదైన ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం విలువైన లోహాల ధరలు 50 శాతం వరకు పడిపోయాయి. దీంతో చాలా మంది రుణ గ్రహీతలు గడువు ముగిసినా గోల్డ్‌ లోన్లు తీర్చడానికి ముఖం చాటేస్తున్నారు. 15 నుంచి 23 శాతం రుణాలు.. బకాయిల గడువు ముగిసి 90 రోజులైనా వసూలు కావడం లేదని పిరామల్‌ ఫైనాన్స్‌ ఇటీవల ప్రకటించింది. దీంతో కంపెనీ ఇలాంటి రుణ గ్రహీతలకు తాజాగా కొత్త రుణాలు ఇవ్వడం ఆపేసింది.


ఆర్‌బీఐ బ్రేకులు

గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌లో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆర్‌బీఐ ముందే ఊహించింది. దీన్ని కట్టడి చేసేందుకు గత ఏడాది జూన్‌లోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పసిడి రుణ మొత్తం రూ.2.5 లక్షల వరకు ఉంటే, పసిడి విలువలో 85 శాతం, రుణ మొత్తం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే పసిడి విలువలో 80 శాతం, రూ.5 లక్షలపైన ఉంటే పసిడి విలువలో 75 శాతానికి మించి రుణంగా ఇవ్వకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఈ రుణాల జోరు కాస్త తగ్గింది. బ్యాంకులు కూడా గోల్డ్‌ లోన్లపై ప్రాధాన్యత తగ్గించాయి. కాగా, 2028 మార్చి నాటికి దేశంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్‌ లోన్ల మొత్తం రూ.30 లక్షల కోట్లకు చేరుతుందని ఇక్రా రేటింగ్‌ సంస్థ అంచనా.

Updated Date - Oct 23 , 2026 | 04:56 AM