Share News

గోల్డ్‌ ఫండ్లలో కొత్త సబ్‌స్క్రిప్షన్లకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:17 AM

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌), హెచ్‌డీఎప్‌సీ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌, కోటక్‌ ఎంఎఫ్‌ సహా దాదాపు 17 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పండగ సీజన్‌లో అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి.

గోల్డ్‌ ఫండ్లలో కొత్త సబ్‌స్క్రిప్షన్లకు బ్రేక్‌
GOLD

  • తాత్కాలికంగా నిలిపివేసిన మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌), హెచ్‌డీఎప్‌సీ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌, కోటక్‌ ఎంఎఫ్‌ సహా దాదాపు 17 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పండగ సీజన్‌లో అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. తమ గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్ఓఎఫ్)లో కొత్త సబ్‌స్ర్కిప్షన్స్‌ను శుక్రవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశాయి. కొన్ని సంస్థలు సిల్వర్‌ ఎఫ్‌ఓఎ్‌ఫలపైనా ఈ ఆంక్షలను విధించాయి. తదుపరి నోటీసు జారీ చేసేవరకు ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఫండ్‌ సంస్థలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. కొత్తగా ఈ ఎఫ్‌ఓఎఫ్‌ల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్పు, క్రమానుగత పెట్టుబడి పథకాల్లో (సిప్‌) కొత్త రిజిస్ట్రేషన్లు, క్రమానుగత బదిలీ ప్లాన్‌ (ఎస్‌టీపీ) సహా కొత్తగా ప్రారంభించే ఇతర పెట్టుబడి మార్గాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ఫండ్‌ సంస్థలు స్పష్టం చేశాయి. అయితే, ఈ సప్పెన్షన్‌ కాలంలో ప్రస్తుత పెట్టుబడుల విడుదల, క్రమానుగత ఉపసంహరణ ప్లాన్లు (ఎప్‌డబ్ల్యూపీ), ప్రస్తుత పథకం నుంచి బయటికి రావడంతో పాటు ఎస్‌టీపీ నుంచి బయటికి వచ్చే వెసులుబాటు మాత్రం ఉంటుందని ఫండ్‌ సంస్థలు తెలిపాయి. ఎఫ్‌ఓఎ్‌ఫలు భౌతిక బంగారం కొనుగోలుకు బదులు గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌)ల్లో పెట్టుబడులు పెడతాయి.


పండగ సీజన్‌లో ఎందుకు..?

సాధారణంగా పెద్ద పండగల సీజన్‌లో దేశంలో పసిడి, వెండి కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలువైన లోహాల కొనుగోలు, పెట్టుబడులకు మంచిరోజుగా భావించే ధనత్రయోదశి, దీపావళి నాడు డిమాండ్‌ పతాక స్థాయికి చేరుకుంటుంది. పెట్టుబడుల గిరాకీ అధికంగా ఉండే సమయంలో ఫండ్‌ సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇందుకు నిర్దేశిత కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఆదేశాల మేరకే ఫండ్‌ సంస్థలు కొత్త పెట్టుబడుల స్వీకరణను నిలిపివేశాయని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ సెప్టెంబరులో గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి నికరంగా రూ.4,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం నెలలో పెట్టుబడులు రూ.2,597 కోట్లుగా నమోదయ్యాయి.

Updated Date - Oct 17 , 2026 | 05:17 AM