గోబర్‌ధన్‌తో రూ.40,000 కోట్లు ఆదా
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:20 AM
వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే లక్ష్యంతో రూ.23,731 కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గోబర్‌ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు.
కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీ: వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే లక్ష్యంతో రూ.23,731 కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గోబర్‌ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఈ పథకం ద్వారా రూ.40,000 కోట్లకు పైగా విలువైన ఇంధన దిగుమతులను ఆదా చేయడంతో పాటు జీడీపీకి రూ.75,000 కోట్లకు పైగా అదనపు విలువను జోడించాలని చూస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, ఆహార వ్యర్థాలు వంటి సేంద్రీయ వ్యర్థాలను ప్రాసెస్ చేసి పునరుత్పాదక ఇంధన వనరులుగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 0.4 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు (ఎంఎంఎస్‌సీఎండీ)గా ఉన్న సీబీజీ ఉత్పత్తిని 4-6 ఎంఎంఎ్‌ససీఎండీలకు పెంచేందుకు ప్రాజెక్టులకు మూలధన సాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం కల్పించనుంది.