పెట్టుబడి పెట్టు.. టార్గెట్‌ను కొట్టు..!
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:38 AM
నిర్దిష్ట లక్ష్యం లేకుండా.. శ్రమించినా, పెట్టుబడులు పెట్టినా ఆశించిన ఫలితం దక్కుతుందా? ముందు మనం ఏమి సాధించాలనుకుంటున్నామో నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉంటుంది.
నిర్దిష్ట లక్ష్యం లేకుండా.. శ్రమించినా, పెట్టుబడులు పెట్టినా ఆశించిన ఫలితం దక్కుతుందా? ముందు మనం ఏమి సాధించాలనుకుంటున్నామో నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. ఇది పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలన్నా.. కారు కొనాలన్నా, ఇంటి కొనుగోలు కోసం అవసరమైన డౌన్‌పేమెంట్ మొత్తాన్ని కూడబెట్టాలన్నా, రిటైర్‌మెంట్, పిల్లల ఉన్నత చదువుల కోసం డబ్బును పోగేయాలన్నా పక్కాగా ప్లాన్ ఉండాల్సిందే. మీ లక్ష్యానికి అవసరమైన సొమ్మును కూడగట్టుకోవాలంటే ఏం చేయాలంటే...
లక్ష్యాలను రాసుకోండి: పెట్టుబడి పెట్టే ముందు మీ లక్ష్యాలు ఏమిటో రాసుకోండి. అలాగే రిటర్నులకు సంబంధించి ఒక గడువును నిర్దేశించుకోండి. చాలా మంది గుడ్డిగా ఏవో కొన్ని పెట్టుబడులకు ఎంచుకుంటూ ఉంటారు. తమకు తెలిసిన వారో లేదా సహోద్యోగులో ఏదైనా ఫండ్ లేదా పథకం గురించి చెప్పే మాటలు విని నమ్మి మరో ఆలోచన చేయకుండా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకునే ముందు వాటి గురించి తెలుసుకోవాలి. అది మీకు సూట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. మీ పెట్టుబడి అనేది మీ లక్ష్యం, కాలం, రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
ఆచితూచి అడుగేయటం బెటర్: డబ్బులు వస్తున్నాయి కదా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అవసరానికి చేయి చాచాల్సి వస్తుంది. అందుకే మీ ఖర్చులకు పోగా చేతిలో కొంత డబ్బు మిగులుతున్నా.. ఒకవేళ బోన్‌సగా కొంత మొత్తం చేతికి అందినా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన రావొచ్చు. అప్పుడు ఆ సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న ప్రశ్న మీ మదిలో తలెత్తుతుంది. డబ్బులను అలాగే అట్టిపెట్టుకుంటే వాటి విలువ ఏమీ పెరగదు. అయితే మీరు ఏదైనా ఫండ్‌లో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో లేదా ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. ఈ డబ్బు దేని కోసం అవసరం ఉంటుంది? ఆ అవసరం ఎప్పుడు ఉంటుంది? ఒకవేళ పెట్టుబడి పెట్టే డబ్బు విలువ నా అవసరానికి తీసుకునే సమయంలో తగ్గితే ఎలా? అన్న ప్రశ్నలు వేసుకోని నిర్ణయాలు తీసుకోండి.
భద్రత ముఖ్యం సుమా: ఎంతో శ్రమించి సంపాదించిన సొమ్మును ఆచితూచి ఖర్చు పెడుతుంటాం. అనవసరంగా ఖర్చయితే మదనపడిపోతాం. కూడబెట్టుకున్న ప్రతి పైసాను జాగ్రత్త చేసుకోవాలనుకుంటాం. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ముందు భద్రతపై దృష్టి పెట్టండి. అధిక వడ్డీని ఇచ్చే సేవింగ్ ఖాతాను, స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్‌ను ఎంచుకోండి. అధిక రిటర్నులు ఎప్పుడు మనల్ని ఆకర్షిస్తుంటాయి. కానీ దాని కన్నా మన సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. మీ లక్ష్యం స్వల్పకాలానికి అంటే..మూడేళ్లలోపు అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మార్కెట్ కుప్పకూలితే మీ పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి ఈ సమయం సరిపోకపోవచ్చు. మూడేళ్లలోపు అయితే లిక్విడ్ ఫండ్స్, స్వల్పకాలిక డెట్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు. వీటిలో రిస్క్ తక్కువ. మూడు నుంచి ఏడేళ్లకు అయితే ఈక్విటీని ఎంచుకోవచ్చు. స్వల్పకాలంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసినా దీర్ఘకాలంలో సర్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంపద వృద్ధికి దోహదపడవచ్చు. ఈ కాలపరిమితిలో అయితే హైబ్రిడ్ ఫండ్స్, షేర్లు, బాండ్లను ఎంచుకోవచ్చు. ఇల్లు కొనేందుకు డౌన్ పేమెంట్ చేయాలనుకునే వారు, పిల్లల చదువులకు ఫీజుల అవసరం ఉంటుందనుకునే వారు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టవచ్చు. ఏడేళ్లకు మించిన కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఎన్‌పీఎస్, పీపీఎఫ్ వంటి వాటిలో పెట్టుబడి ఆలోచన చేయవచ్చు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వయసు ఎంత? మీ లక్ష్యం ఏమిటీ? ఎంతకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు? ఎంత రిస్క్, రివార్డు ఉంటుందన్న అంశాలపై దృష్టి పెట్టాలి.