Share News

ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.1.35 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:23 AM

పశ్చిమాసియా యుద్ధం మన దేశంలోని విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ)ను భయపెడుతోంది. యుద్ధం కారణంగా ఎక్కడ తమ పెట్టుబడుల విలువ...

ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.1.35 లక్షల కోట్లు

  • మార్చిలో ఇప్పటి వరకు రూ.88,180 కోట్లు

  • యుద్ధంతో హోరెత్తిన అమ్మకాలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం మన దేశంలోని విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ)ను భయపెడుతోంది. యుద్ధం కారణంగా ఎక్కడ తమ పెట్టుబడుల విలువ తగ్గిపోతుందనే భయంతో ఈ సంస్థలు దేశీయ స్టాక్‌ మార్కెట్లో పొలోమంటూ అమ్మకాలకు దిగుతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఏకంగా రూ.88,180 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 2024 అక్టోబరు తర్వాత ఎఫ్‌పీఐలు భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఇంత భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి. ఆ నెలలో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌ నుంచి రికార్డు స్థాయిలో రూ.94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

ఏడాది ఆరంభం నుంచే: నిజానికి ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో అమ్మకాలకు దిగాయి. జనవరిలో రూ.35,962 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టినా అది మున్నాళ్ల ముచ్చటే అయింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన వెంటనే మళ్లీ భారీ అమ్మకాలకు తెరతీశాయి.

దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ.1,35,083 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తం మీద అమ్మిన రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.8,083 కోట్లు ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి భారత స్టాక్‌ మార్కెట్‌లో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ.1.5 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 23 , 2026 | 06:24 AM