15 శాతం తగ్గనున్న ఎరువుల ఉత్పత్తి
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:03 AM
దేశంలో ఎరువుల ఉత్పత్తిపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడనుంది. ప్రధాన ముడి పదార్ధాలైన ఎల్‌ఎన్‌జీ, అమ్మోనియా సరఫరాకు మూడు నెలల పాటు అడ్డంకులు...
రూ.25,000 కోట్ల మేర పెరగనున్న సబ్సిడీ భారం : క్రిసిల్ రేటింగ్స్
ముంబై: దేశంలో ఎరువుల ఉత్పత్తిపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడనుంది. ప్రధాన ముడి పదార్ధాలైన ఎల్‌ఎన్‌జీ, అమ్మోనియా సరఫరాకు మూడు నెలల పాటు అడ్డంకులు ఏర్పడితే దేశం లో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తి 10 నుంచి 15 శాతం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. అయితే గ్యాస్ సరఫరాలో 70 శాతం యూరియా తయారీ ప్లాంట్లకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం కొంత వరకు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రసాయన ఎరువుల నిల్వలు మూడు నెలల అవసరాలకు సరిపోతాయన్నారు. దిగుమతులు కూడా పెరుగుతున్నందున ప్రస్తుతానికైతే పెద్దగా ఇబ్బం ది ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
40% పశ్చిమాసియా దేశాల నుంచే..
దిగుమతి చేసుకునే ఎరువుల ధర పెరగడం, పెరుగుతున్న ముడి పదార్ధాల రవాణా ఖర్చులతో ఎరువుల కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పెంచుతాయని కులకర్ణి చెప్పారు. దీనివల్ల ఎరువుల సబ్సిడీ భారం కూడా రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందన్నారు. మన దేశం ఇప్పటికీ యూరియా అవసరాల్లో 20 శాతం, కాంప్లెక్స్ ఎరువుల్లో మూడో వంతు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. మనం దిగుమతి చేసుకునే యూరియా, డీఏపీ ఎరువుల్లో 40 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. అలాగే దేశంలో ఎరువుల ఉత్పత్తికి ప్రధాన ముడి పదార్ధాలైన ఎల్‌ఎన్‌జీలో 60 నుంచి 65 శాతం, అమ్మోనియాలో 75 నుంచి 80 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తోందని కులకర్ణి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..
మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..