Share News

వంట నూనెల ధరలు సలసల

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:08 AM

పండగల సీజన్‌కు ముందే దేశంలో వంట నూనెల సెగ ప్రారంభమైంది. ప్రధాన వంట నూనెల ధర గత ఏడాది కాలంలో సగటున 12.8 శాతం పెరిగాయి. కేంద్ర వినియోగదారుల...

వంట నూనెల ధరలు సలసల

ఏడాదిలో 12.8% అప్‌

పండగల సీజన్‌ నాటికి మరింత పైకి!

న్యూఢిల్లీ: పండగల సీజన్‌కు ముందే దేశంలో వంట నూనెల సెగ ప్రారంభమైంది. ప్రధాన వంట నూనెల ధర గత ఏడాది కాలంలో సగటున 12.8 శాతం పెరిగాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ (డీసీఏ) నివేదిక ప్రకారం ఈ నెల మూడవ తేదీ నాటికి రిటైల్‌ మార్కెట్లో, కిలో ఆవనూనె రూ.193.54, సోయా ఆయిల్‌ రూ.163.10, పామాయిల్‌ రూ.147.37కు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మూడు వంట నూనెల ధర సగటున 10.74 శాతం నుంచి 12.87 శాతం వరకు పెరిగాయి. మూడు నెలల క్రితం ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ లో ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ క్యాన్‌ రూ.850 నుంచి రూ.870 మధ్య ఉండేది. ఇప్పుడది బ్రాండ్‌ను బట్టి రూ.970 నుంచి రూ.1,395 వరకు పలుకుతోంది.

యుద్ధం దెబ్బ

పశ్చిమాసియా యుద్ధ ప్రఽబావం వంట నూనెల ధరలపైనా పడింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నౌకా రవాణ, బీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒక దశలో రూ.97 వరకు పడిపోయింది. దీనికి తోడు ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు తమ దేశంలో ఉత్పత్తి చేసే పామాయిల్‌లో కొంత భాగాన్ని బయో ఫ్యూయల్స్‌కు మళ్లిస్తున్నాయి. ఇండోనేషియా అయితే ఈ నెల 1 నుంచి తమ దేశంలో విక్రయించే పెట్రోల్‌, డీజిల్‌లో సగం పామాయిల్‌ కలపాలని నిర్ణయించింది. మన దేశంలో వంట నూనెల ధర పెరిగేందుకు ఇవన్నీ ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో ఈ నెల 3వ తేదీ నాటికి.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ముంబై రేవుకు దిగుమతయ్యే పామాయిల్‌ ధర 11 శాతం, సోయా ఆయిల్‌ ధర 6 శాతం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర 20 శాతం పెరిగిన విషయాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

అంతర్జాతీయ ఆటుపోట్లు

భారత్‌ ప్రస్తుతం తన వంట నూనెల అవసరాల్లో 57 నుంచి 58 శాతం దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది అక్టోబరుతో ముగిసిన 2024-25 ఆయిల్‌ ఇయర్‌లో మన దేశం 1,830 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.74 లక్షల కోట్లు) విలువైన 160.1 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంది. గత ఏడాది నవంబరులో ప్రారంభమైన 2025-26 ఆయిల్‌ ఇయర్‌లో ఈ దిగుమతులు 168 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.


మరింత పెరిగే చాన్స్‌!

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ ఎల్‌నినో భయం వెంటాడుతోంది. ఈ ప్రభావంతో మన దేశంలోనూ వర్షాభావం కనిపిస్తోంది. దీంతో వేరు శనగ, సోయా ఎక్కువగా సాగు చేసే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖరీఫ్‌ నూనె గింజల ఖరీఫ్‌ సాగు ఇప్పటికే 30 శాతం పడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పండగల సీజన్‌ నాటికి దేశంలో వంట నూనెల సెగ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 05:08 AM