మ్యూనిషన్స్ ఇండియాతో డ్రోగో ఏరోస్పేస్ జట్టు
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:28 AM
భారత రక్షణ రంగానికి అవసరమైన కీలక ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో హైదరాబాద్ కీలకంగా మారుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రక్షణ రంగ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్..
ఆత్మాహుతి డ్రోన్ల అభివృద్ధిలో సహకారం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత రక్షణ రంగానికి అవసరమైన కీలక ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో హైదరాబాద్ కీలకంగా మారుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రక్షణ రంగ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ రంగంలోని మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఎంఓయూపై డ్రోగో ఏరోస్పేస్ వ్యవస్థాపకులు, సీఈఓ బొంతు యశ్వంత్, ఎంఐఎల్ ఈడీ కుమార్ వైభవ్ గౌర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద డ్రోగో ఏరోస్పేస్.. అభివృద్ధి చేసి, తయారు చేసే ఆత్మాహుతి డ్రోన్లను మరింత శక్తివంతమైన పేలుడు, మందుగుండు సామాగ్రితో అనుసంధానం చేయడంలో ఎంఐఎల్ సహకరిస్తుంది.
యుద్ధ రంగంలో కీలకం: యుద్ధ రంగంలో నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడులు చేయడంలో ఇటీవల ఆత్మాహుతి డ్రోన్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో డ్రోగో ఏరోస్పేస్, మందుగుండు సామాగ్రి అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న ఎంఐఎల్ చేతులు కలపడం విశేషం. డ్రోగో ఏరోస్పేస్.. ఇటీవల డెల్టా వింగ్ కామికేజ్ అనే ఆత్మాహుతి డ్రోన్‌ను అభివృద్ధి చేసి హైదరాబాద్ సమీపంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆత్మాహుతి డ్రోన్ నిర్దేశిత లక్ష్యాలపై తచ్చాడుతూ 20 నుంచి 30 కిలోల మందుగుండు సామాగ్రితో వాటిని ధ్వంసం చేస్తుంది.