Share News

పేటెంట్‌ ఔషధాలపై ట్రంప్‌ పిడుగు

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:06 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ సుంకాల యుద్ధానికి తెరతీశారు. ఈసారి ఆయన పేటెంట్‌ ఔషధాలు, వాటి తయారీకి ఉపయోగించే కీలక ముడి పదార్ధాల దిగుములపై 100 శాతం సుంకాలు విధించారు.

పేటెంట్‌ ఔషధాలపై ట్రంప్‌ పిడుగు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ సుంకాల యుద్ధానికి తెరతీశారు. ఈసారి ఆయన పేటెంట్‌ ఔషధాలు, వాటి తయారీకి ఉపయోగించే కీలక ముడి పదార్ధాల దిగుములపై 100 శాతం సుంకాలు విధించారు. దీనికి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో 1962 నాటికి దేశ జాతీయ భద్రతా చట్టంలోని సెక్షన్‌ 232, 1974 నాటికి వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 కింద ఈ సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

భారత్‌కు ఊరట!

అయితే ఈ సుంకాల ప్రభావం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ఉండదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మన దేశం నుంచి అమెరికాకు జరిగే ఔషధ ఎగుమతుల్లో 90 శాతం పేటెంట్‌ గడువు ముగిసిన జెనరిక్‌ ఔషధాలే ఎక్కువగా ఉండడం ఇందుకు కారణమని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ శ్రీవాస్తవ్‌ చెప్పారు. అయితే ట్రంప్‌ తాజా సుంకాల ప్రభావం అమెరికాకు పేటెంట్‌ ఔషధాలు ఎక్కువగా ఎగుమతి చేసే ఐర్లాండ్‌, జర్మనీ, జపాన్‌, యూకే, స్విట్జర్లాండ్‌, బెల్జియం, డెన్మార్క్‌, జపాన్‌ దేశాల ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉంటుందన్నారు.

అయినా అనిశ్చితే?

ప్రస్తుతం ఈ సుంకాల పోటు పేటెంట్‌ ఔషధాలకు మాత్రమే పరిమితం. అయితే ఏడాది తర్వాత జెనరిక్‌ ఔషధాలకు ఉన్న మినహాయింపును సమీక్షిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. వ్యూహాత్మకంగానే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జెనరిక్‌ ఔషధాలపై సుంకాలు విధిస్తే అమెరికాలో ఔషధ ధరలు చుక్కలంటి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందనే భయంతోనే ట్రంప్‌ సర్కార్‌ ప్రస్తుతానికి ఈ విషయం పక్కన పెట్టిందని భావిస్తున్నారు. ఏడాది తర్వాత ఈ మినహాయింపును పక్కన పెట్టి జెనరిక్స్‌పైనా సుంకాల భారం మోపితే భారత ఫార్మా కంపెనీలకూ తిప్పలు తప్పవని భావిస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 04:06 AM