భగ్గుమన్న ముడి చమురు ధరలు!
ABN , Publish Date - Jul 23 , 2026 | 09:55 PM
అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేకపోవడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేకపోవడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు నెలల్లో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లను దాటింది. బ్రెంట్ క్రూడ్ ధర 6.45 శాతం మేర పెరిగి 100 డాలర్లను దాటింది. మరోవైపు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర కూడా 91 డాలర్లను దాటింది.
గల్ఫ్‌లో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరా ప్రభావితం అవుతుందన్న అంచనాల నడుమ నేడు ధరల్లో ర్యాలీ చోటుచేసుకుంది. పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు తోడు ఎర్ర సముద్రంలో కూడా ఇరాన్ మద్దతుదారులైన హౌతీలతో సరకు రవాణా నౌకలకు ముప్పు పెరగడంతో ముడి చమురు ధరలు చుక్కలను అంటుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే భారత్‌కు ఆర్థిక సవాళ్లు పెరుగుతాయి. దిగుమతుల ఖర్చు పెరిగి విదేశీమారకంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం, భారత కరెన్సీ విలువ పడిపోవడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
సౌదీ చమురు ట్యాంకర్లపై దాడి చేసింది మేమే: హౌతీ
బ్రిడ్జ్‌లు కూలుస్తాం.. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కౌంటర్!