Share News

వంటింటిపైనా యుద్ధ ప్రభావం

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:07 AM

గల్ఫ్‌ యుద్ధం వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. దిగుమతయ్యే సన్‌ ఫ్లవర్‌, సోయా నూనెల ధరలు ఈ యుద్ధంతో మరింతగా పెరిగాయి.

వంటింటిపైనా యుద్ధ ప్రభావం

  • వంట నూనెల దిగుమతులకూ అడ్డంకులు

  • సలసల కాగుతున్న వంట నూనెల ధర

  • లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.200పైనే

  • సోయా, పామాయిల్‌కు మళ్లుతున్న మధ్య తరగతి

న్యూఢిల్లీ: గల్ఫ్‌ యుద్ధం వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. దిగుమతయ్యే సన్‌ ఫ్లవర్‌, సోయా నూనెల ధరలు ఈ యుద్ధంతో మరింతగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో రిటైల్‌ మార్కెట్లో రూ.150 పలికిన లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌.. ప్రస్తుతం కంపెనీని బట్టి రూ.190 నుంచి రూ.202 వరకు పలుకుతోంది. లీటరు విజయ రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర సైతం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాల్లో రూ.202కు చేరింది. ఇక కోల్డ్‌ ప్రెస్డ్‌ సన్‌ ఫ్లవర్‌ అయిల్‌ ధరైతే కొన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాల్లో లీటరు రూ.280 నుంచి రూ.350 మధ్య పలుకుతోంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం వంట నూనెల ధరలకు మరింత సెగ పెడుతోంది.

ఇతర వంట నూనెలదీ అదే పరిస్థితి

ఇతర వంట నూనెలదీ ఇదే పరిస్థితి. వేరుశనగ దిగుబడులు తగ్గడంతో పల్లీ నూనె ధరా దూసుకుపోయింది. గత ఏడాది డిసెంబరులో రూ.175-180 మధ్య పలికిన కిలో వేరుశనగ నూనె ప్రస్తుతం రూ.200 నుంచి రూ.220 మధ్య పలుకుతోంది. ఆవనూనెదీ ఇదే పరిస్థితి. గత ఏడాది ఏప్రిల్‌లో కిలో రూ.170 పలికిన కిలో ఆవ నూనె ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో రూ.188-190 మధ్య ఉంది. గత నెల 2న కిలో రూ.136 పలికిన పామాయిల్‌ ధర ప్రస్తుతం బ్రాండ్‌ను బట్టి కిలో రూ.141 నుంచి రూ.150 మధ్య పలుకుతోంది.

పెరిగిన నౌకా రవాణా చార్జీలు

మన దేశంలో ఎక్కువగా వినియోగించే సన్‌ ఫ్లవర్‌లో ఎక్కువ భాగం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచే రావాలి. గల్ఫ్‌ యుద్ధంతో ఈ దేశాల నుంచి వంట నూనెలతో వచ్చే నౌకల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో నౌకా కంపెనీలు రవాణా చార్జీలు పెంచేశాయి. సరఫరా అడ్డంకులతో పాటు రవాణా చార్జీల భారం తోడవడంతో దిగుమతిదారులు ధరలు పెంచేశారు. ఆ ప్రభావం రిటైట్‌ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే వంటింటి బడ్జెట్‌ పెద్ద గుదిబండగా మారుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.


తగ్గనున్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాలు

సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ధరల మంటతో అనేక మంది మధ్య తరగతి ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు పామాయిల్‌ వంటి చౌకగా వచ్చే ప్రత్యామ్నాయాలకు మారుతున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) దేశం లో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాల పరిమాణం 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ ఇటీవల ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుతం కిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర.. సోయా, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ కంటే రూ.10 నుంచి రూ.20 ప్రీమియంతో అమ్ముడవుతోంది.

తగ్గుతున్న నిల్వలు

మరోవైపు దేశంలో వంట నూనెల నిల్వలు పడిపోతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభానికి ముందు దేశంలో 30 నుంచి 45 రోజుల అవసరాలకు సరిపడా వంట నూనెల నిల్వలు ఉండేవి. సరఫరా అడ్డంకులతో ఇప్పుడవి 20 నుంచి 30 రోజుల అవసరాలకు పడిపోయాయి. హోర్ముజ్‌ మూసివేతకు ఇప్పట్లో తెరపడకపోతే ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి పెంచితే తప్ప ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే దేశీయ వంట నూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. నూనె గింజల పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర, దిగుమతుల నుంచి రక్షణ లభిస్తే తప్ప, రైతు దేశంలో నూనె గింజల పంటలు సాగు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరని నిపుణులు చెబుతున్నారు.

సబ్బులు, డిటర్జెంట్లపైనా!

గల్ఫ్‌ యుద్ధ ప్రభావం సబ్బులు, డిటర్జెంట్‌ కంపెనీలపైనా కనిపిస్తోంది. ఈ కంపెనీల ప్రధాన ముడి పదార్ధాలు, ప్యాకేజింగ్‌ ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుత ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 3 నుంచి 4 శాతం వరకు పెంచుతాయని భావిస్తున్నారు. కొన్ని కంపెనీలైతే ధరలు పెంచకుండా గతంలోలా ప్యాకెట్లలోని వస్తువుల పరిమాణాన్ని తగ్గించి నెట్టుకు వచ్చే అవకాశం ఉందని నువామా ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అనే బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచితే, అమ్మకాలు పడిపోతాయనే భయమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Updated Date - Apr 04 , 2026 | 04:07 AM