Share News

బ్లాక్‌ ఫ్రైడే

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:35 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఈ వారాంతం బ్లాక్‌ ఫ్రైడేగా పరిణమించింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ట్రేడర్లు ఐటీ, లోహ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక సూచీలు భారీగా నష్టపోయాయి.

బ్లాక్‌ ఫ్రైడే

  • సెన్సెక్స్‌ 1,048 పాయింట్లు డౌన్‌

  • 25,500 దిగువకి నిఫ్టీ

  • ఐటీ, మెటల్‌ షేర్లలో అమ్మకాలు

  • రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఈ వారాంతం బ్లాక్‌ ఫ్రైడేగా పరిణమించింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ట్రేడర్లు ఐటీ, లోహ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,140.37 పాయింట్లు క్షీణించి 82,534.55 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 1,048.16 పాయింట్ల (1.25 శాతం) నష్టంతో 82,626.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 336.10 పాయింట్లు (1.30 శాతం) పతనమై 25,471.10 వద్ద స్థిరపడింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.7.02 లక్షల కోట్లు తగ్గి రూ.465.46 లక్షల కోట్లకు (5.13 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

అసలేమైంది...?

అంతర్జాతీయ ప్రతికూలతలతో పాటు డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్‌ అంచనాల కంటే బలహీనంగా ఉండటం, ఆంరఽథోపిక్‌ విడుదల చేసిన కొత్త కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ దేశీయ ఐటీ రంగ కంపెనీల ఆదాయానికి భారీగా గండికొట్టవచ్చన్న భయాలు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆంథ్రోపిక్‌ ఎఫెక్ట్‌తో టెక్‌ షేర్లలో గత కొన్ని రోజులుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దాంతో నిఫ్టీ ఐటీ సూచీ ఇంట్రాడేలో 10 నెలల కనిష్ఠానికి పతనమైంది. అమెరికా ఆంక్షల నుంచి ఊరట కోసం రష్యా మళ్లీ డాలర్లలో చెల్లింపులను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నదన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు మెటల్స్‌తో పాటు ఇతర కమోడిటీ షేర్లలో పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 28 నష్టపోయాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 953.64 పాయింట్లు (1.14ు), నిఫ్టీ 222.6 పాయింట్లు (0.86ు) క్షీణించాయి.


ఈక్విటీ సెగ్మెంట్లోకి ఎన్‌సీడీఈఎక్స్‌

నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌సీడీఈఎక్స్‌).. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ట్రేడింగ్‌, పర్యవేక్షణ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి కోసం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎ్‌సతో ఎన్‌సీడీఈఎక్స్‌ దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2003లో ఏర్పాటైన ఎన్‌సీడీఈఎక్స్‌.. సెబీ నియంత్రిత అగ్రి కమోడిటీ ఎక్స్ఛేంజ్‌.

విరూపాక్ష ఆర్గానిక్స్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

హైదరాబాద్‌కు చెందిన విరూపాక్ష ఆర్గానిక్స్‌, పరుపుల తయారీ కంపెనీ డ్యూరోఫ్లెక్‌, ప్రీమియర్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ సహా 5 కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లకు సెబీ ఆమోదం లభించింది. అందులో ముంబైకి చెందిన హెక్సాగాన్‌ న్యూట్రీషన్‌, ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కూడా ఉన్నాయి. ఐపీఓలో భాగంగా విరూపాక్ష ఆర్గానిక్స్‌ పూర్తిగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.740 కోట్లు సమీకరించాలనుకుంటోంది. అందులో రూ.360 కోట్లను ప్లాంట్ల విస్తరణకు పెట్టుబడి పెట్టనుంది. మరో రూ.195 కోట్లతో రుణ భారాన్ని తగ్గించుకోవాలనుకుంటోంది. మిగతా సొమ్మును ఇతర వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సెబీకి సమర్పించిన ఐపీఓ పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ)లో కంపెనీ వెల్లడించింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) నమోదిత ఇన్వెస్టర్‌ ట్రేడింగ్‌ ఖాతాలు ఈ నెలలో 25 కోట్లు దాటాయి. గడిచిన 16 నెలల్లో ఎన్‌ఎ్‌సఈ ట్రేడింగ్‌ అకౌంట్లు 5 కోట్లు (20 కోట్ల నుంచి 25 కోట్లకు) పెరిగాయి. మొత్తం ఖాతాల్లో 20 శాతానికి సమానమిది. అంతేకాదు, కేవలం రెండు నెలల్లో అకౌంట్లు 24 కోట్ల నుంచి 25 కోట్లకు పెరిగాయి.

Updated Date - Feb 14 , 2026 | 01:35 AM