బంగారం, వెండిఢమాల్!
ABN , Publish Date - Jan 31 , 2026 | 02:46 AM
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కాంట్రాక్టు ధర శుక్రవారం రూ.67,891 లేదా 16.97 శాతం తగ్గి రూ.3,32,002కు జారుకుంది.
భారీగా పతనమైన ధరలు
రూ.3.32 లక్షలకు చేరిక
రూ.15,000కు పైగా పతనమై రూ.1.54 లక్షలకు జారిన పసిడి
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కాంట్రాక్టు ధర శుక్రవారం రూ.67,891 లేదా 16.97 శాతం తగ్గి రూ.3,32,002కు జారుకుంది. వెండికిదే అతిపెద్ద ఒక్కరోజు పతనం. గురవారం నాడు నమోదైన ఆల్‌టైం రికార్డు ధర రూ.4.20 లక్షలతో పోలిస్తే, దాదాపు రూ.88,000 లేదా 24 శాతం తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి కాంట్రాక్టు రేటు కూడా రూ.15,246 లేదా 9 శాతం తగ్గి రూ.1,54,157కు పడిపోయింది. గురువారం నాడు నమోదైన సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి రూ.1,80,779 తో పోలిస్తే రూ.26,600 లేదా దాదాపు 15 శాతం క్షీణించింది. గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) విలువ 20ు వరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పతనమవడమే ఇందుకు ప్రధాన కారణం. ఢిల్లీ మార్కెట్లోనూ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.14,000 (7.65ు) తగ్గి రూ. 1,69,000కు జారుకోగా.. కేజీ సిల్వర్ రేటు రూ.20,000 (5ు) క్షీణించి రూ.3,84,500కు పరిమితమైంది.
5,000 డాలర్ల దిగువకు బంగారం.. 100 డాలర్ల కిందికి సిల్వర్: ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (కామెక్స్)లో ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కాంట్రాక్టు ధర గురువారం ఒక దశలో 19.30 డాలర్లు (16.87ు) క్షీణించి 95.12 డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. అంతక్రితం సెషన్‌లో ఔన్స్ సిల్వర్ 121.78 డాలర్ల వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ కాంట్రాక్టు రేటు సైతం 392.1 డాలర్లు (7.32ు) పతనమై 4,962.7 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంతక్రితం రోజున ఔన్స్ బంగారం 5,626.8 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. శుక్రవారం కూడా బంగారం రేటు మరో 9 శాతానికి పైగా పతనంతో ట్రేడవుతోంది.
గంటలో రూ.294 లక్షల కోట్లు ఫట్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ట్రేడింగ్ గురువారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ‘‘ఈస్ట్రన్ టైమ్(ఈటీ) ప్రకారం.. ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్యలో గోల్డ్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) 3.2 లక్షల కోట్ల డాలర్ల (రూ.294 లక్షల కోట్ల పైమాటే) మేర తరిగి పోయింది. అంటే, సగటున నిమిషానికి 5,800 కోట్ల డాలర్ల (రూ.5.33 లక్షల కోట్లు) మేర కరిగిపోయిందని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ కామెంటరీ ప్లాట్‌ఫామ్ ది కొబెయిసీ లెటర్ తన ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఉదయం 10.25 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్యకాలంలో గోల్డ్ మార్కెట్ క్యాప్ మళ్లీ 2.3 లక్షల కోట్ల డాలర్లు (రూ.211.44 లక్షల కోట్లు) పెరిగింది. అంటే, 6.5 గంటల్లో గోల్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.5 లక్షల కోట్ల డాలర్ల శ్రేణిలో ఊగిసలాడిందని, ప్రపంచ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే మూడు రెట్లని కొబెయిసీ లెటర్ పేర్కొంది. అంతేకాదు, గోల్డ్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఒక్కరోజు ఊగిసలాటని, 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ గోల్డ్ ఈ స్థాయిలో ఒడుదుడుకులకు లోను కాలేదని తన పోస్ట్‌లో ప్రస్తావించింది.
అసలేమైంది..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను శుక్రవారం ఎంపిక చేశారు. ఫెడ్ రిజర్వ్ పగ్గాలను వార్ష్‌కు అప్పగించబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో గురువారమే గోల్డ్, సిల్వర్ రేట్లు క్రాష్ అయ్యాయి. ఎందుకంటే, గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేసిన వార్ష్.. వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి కలిగిన వ్యక్తి. ఆయన కఠిన పరపతి విధానం ద్వారా డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాల నేపథ్యంలో కమోడిటీ ఇన్వెస్టర్లు అప్రమత్తమై రికార్డు గరిష్ఠాల వద్ద పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక్కసారిగా అమ్మకాలను పోటెత్తించడంతో బంగారం, వెండితోపాటు అన్ని లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దానికి కారణం బంగారం, ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లది విలోమ సంబంధం.