ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో అపోలో మైక్రోకు 41 శాతం వాటా
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:32 AM
రక్షణ రంగానికి చెందిన రెండు హైదరాబాద్ లిస్టెడ్ కంపెనీల మధ్య కొనుగోలు ఒప్పందం కుదిరింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్‌లో 41.33 శాతం వాటాను దాదాపు రూ.1,550 కోట్లకు కొనుగోలు...
డీల్ విలువ రూ.1,550 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రక్షణ రంగానికి చెందిన రెండు హైదరాబాద్ లిస్టెడ్ కంపెనీల మధ్య కొనుగోలు ఒప్పందం కుదిరింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్‌లో 41.33 శాతం వాటాను దాదాపు రూ.1,550 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌కు చెందిన 2.22 కోట్ల షేర్లను అపోలో మైక్రోసిస్టమ్స్ కొనుగోలు చేయనుంది. ఆ తర్వాత, సెబీ నిబంధనలకు లోబడి ప్రీమియర్ ఎనర్జీల్లో మరో 26 శాతం వాటాను స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు ధరను ఒక్కో షేరుకు రూ.698 గా నిర్ణయించింది.
వచ్చే ఐదు నెలల్లో డీల్ పూర్తి
పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ డీల్.. నియంత్రణ మండళ్లు, వాటాదారుల అనుమతులకు లోబడి డిసెంబరు చివరికల్లా పూర్తి కావచ్చని అంచనా. వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్..అపోలో మైక్రో సిస్టమ్స్ నియంత్రణ పరిధిలోకి రానుంది. అయినప్పటికీ ప్రస్తుత బ్రాండ్‌నేమ్‌తోనే వ్యాపారాన్ని కొనసాగించనుంది.
అపోలో.. 41 ఏళ్ల ప్రస్థానం
41 ఏళ్ల క్రితం ప్రారంభమైన అపోలో మైక్రోసిస్టమ్స్.. ఏరోస్పేస్, డిఫెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాలకు టెక్నాలజీ ఆధారిత సేవలందిస్తోంది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ మిసైల్ ప్రోగ్రామ్స్ కోసం సాలిడ్ ప్రొపెల్లెంట్స్‌ను తయారు చేస్తోంది. అలాగే, భారత రక్షణ, వైమానిక, మైనింగ్ రంగాలకు కౌంటర్ మెషర్ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తోంది. బీఎ్‌సఈలో అపోలో మైక్రోసిస్టమ్స్ షేరు ధర గురువారం 1.33 శాతం లాభంతో రూ.398.60 వద్ద ముగిసింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ షేరు 4.13 శాతం ఎగబాకి రూ.714.75 వద్ద స్థిరపడింది.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..