హైదరాబాద్, విశాఖ సహా 100 నగరాలకు ‘అమెజాన్ నౌ’ విస్తరణ
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:10 AM
హైదరాబాద్, విశాఖపట్నం, పుణె, చెన్నై, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 100 నగరాలకు తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను విస్తరించాలని నిర్ణయించినట్టు ఈ-కామర్స్ దిగ్గజం...
న్యూఢిల్లీ: హైదరాబాద్, విశాఖపట్నం, పుణె, చెన్నై, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 100 నగరాలకు తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను విస్తరించాలని నిర్ణయించినట్టు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సోమవారం ప్రకటించింది. అయితే ఎప్పటి వరకు ఈ విస్తరణను పూర్తి చేస్తుందో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరులో అమెజాన్ నౌ సేవలు అందుబాటులో ఉన్నాయి. గత వారంలో అమెజాన్ ఇండియా ప్రకటించిన రూ.2,800 కోట్ల పెట్టుబడిలో క్విక్ కామర్స్ సర్వీసు విస్తరణ కూడా భాగంగా ఉంది. క్విక్ కామర్స్ విస్తరణ ద్వారా 16 వేల మందికి పైగా రైతులు తమ తాజా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు అమెజాన్ సాంకేతికత, కార్యకలాపాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని అమెజాన్ ఇండియా ఎవ్రీడే ఎసెన్షియల్స్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ గోయల్ తెలిపారు.