Share News

ఏఐ సునామీ.. మెల్లిగా ముంచుకొస్తోంది..!!

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:53 AM

కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలకు ముంచుకొస్తున్న ముప్పుపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీవా.. ఏఐని ‘నిదానంగా ముంచుకొస్తున్న సునామీ’గా అభివర్ణించారు.

ఏఐ సునామీ..   మెల్లిగా ముంచుకొస్తోంది..!!
AI

  • 40 శాతం ఉద్యోగాలకు ముప్పు

  • ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా

  • ఏఐతో ముప్పే: వెంబు

బ్యాంకాక్‌: కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలకు ముంచుకొస్తున్న ముప్పుపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీవా.. ఏఐని ‘నిదానంగా ముంచుకొస్తున్న సునామీ’గా అభివర్ణించారు. ఈ టెక్నాలజీ పుణ్యమాని ప్రపంచంలో దాదాపు 40 శాతం ఉద్యోగాల స్థాయి పెరగడం, తగ్గడం లేదా పోవడం వంటి ఏదో ఒక రూపంలో ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. అభివృద్ధి చెందిన దేశాల జాబ్‌ మార్కెట్లపై ఏఐ ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్న విషయాన్ని ఐఎంఎఫ్‌ ఎండీ గుర్తు చేశారు. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో ఆమె ఈ విషయాలను ప్రస్తావించారు. ఏఐ కారణంగా సాధారణ, పునరావృత విఽఽధులతో కూడిన ఉద్యోగాలు తగ్గిపోతుంటే... డేటా సెంటర్ల నిర్మాణం, సేవల రంగాల్లో మాత్రం ఉద్యోగాలు పెరుగుతున్నట్టు తెలిపారు. కాగా, ఏఐ టెక్నాలజీ ప్రభుత్వాల ఆదాయానికీ గండి కొట్టవచ్చన్నారు. ఏఐతో ఆర్థిక ప్రయోజనాలన్నీ పన్ను చెల్లింపుదారుల్లో అతిపెద్ద విభాగమైన ఉద్యోగులకు బదులు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లవచ్చని ఆమె హెచ్చరించారు.

ఏఐతో ఉద్యోగాలకు ముప్పు ఉందన్న వాదనను దేశీయ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీ జోహో అధినేత శ్రీధర్‌ వెంబు సమర్ధించారు. ముఖ్యంగా ‘మేధో కొలువు’లకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నారు. ఏఐ పుణ్యమాని ఇప్పటికే అత్యంత మేధో పనులుగా భావించే సాఫ్ట్‌వేర్‌, గణిత పనులను తేలిగ్గా చేసేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏఐతో కొన్ని ఉద్యోగాలకు ప్రమాదం ఉన్నా, మనుషులు చేయడానికి ఇంకా అనేక పనులు ఉన్నట్టు వెంబు చెప్పారు.

Updated Date - Oct 13 , 2026 | 04:54 AM