ఏఐ కొలువుల్లో 20శాతంవృద్ధి
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:03 AM
సెప్టెంబరులో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం పెరిగాయని జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ వెల్లడించింది.
సెప్టెంబరులో 2 శాతం పెరిగిన నియామకాలు
హైదరాబాద్‌లో 9శాతం పెరుగుదల: నౌకరీ.కామ్
ముంబై: సెప్టెంబరులో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం పెరిగాయని జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) నిపుణుల నియామకాలు రికార్డు స్థాయిలో 20శాతం వృద్ధి చెందడం ఇందుకు ప్రధానంగా దోహదపడిందని శుక్రవారం విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. ఆటోమొబైల్ రంగంలో కొలువులు 11శాతం పెరగగా.. బీపీఓ/ఐటీఈఎస్, జీసీసీ హైరింగ్ 4శాతం పెరిగాయని తెలిపింది.
బీమా, రిటైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నియామకాలు స్థిరంగా కొనసాగగా..ఐటీ/సా్‌ఫ్టవేర్ సేవలు, ఫార్మా/బయోటెక్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నియామకాలు 4శాతంచొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్‌లో 3శాతం, ఆతిథ్యం, పర్యాటక రంగంలో 11శాతం, విద్యా రంగంలో 18శాతం తగ్గుదల నమోదైంది.
ఎంట్రీ, ఎర్లీ-మిడ్ లెవెల్ ఉద్యోగ నియామకాలు స్థిరంగా కొనసాగాయి. ఫ్రెషర్ల హైరింగ్ ఒక శాతం పెరగగా.. 4-7 ఏళ్ల అనుభవం కలిగిన వారి నియామకాలు మాత్రం 2 శాతం తగ్గాయి. 8-12 ఏళ్ల అనుభవజ్ఞులకు కొలువులు 5ు, 13-16 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణుల హైరింగ్ 7ు, 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన వారికి ఉద్యోగాలు 5ు పెరిగాయి.
నగరాల వారీగా చూస్తే, హైదరాబాద్‌లో నియామకాలు అత్యధికంగా 9ు పెరగగా.. చెన్నైలో 6ు, బెంగళూరు, కోల్‌కతాల్లో 4 శాతంగా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైల్లో మాత్రం హైరింగ్ 6ు చొప్పున తగ్గింది.
హైరింగ్ ప్రక్రియలో పెరుగుతున్న ఏఐ మోసాలు
ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థి చిత్తశుద్ధిని అంచనా వేయడం మరింత సంక్లిష్టంగా మారిందని రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ హైర్‌ప్రో అంటోంది. నైపుణ్య నిర్ధారణ, ఇంటర్వ్యూ సమయంలో ఏఐ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఉద్యోగార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వెల్లడించింది. నైపుణ్య నిర్ధారణ సమయంలో ఏఐ మోసాలు గత ఆర్థిక సంవత్సరంలో 45 శాతానికి పెరగగా, 2021-22లో ఇది 32శాతం ఉంది. ఇంటర్వ్యూలో ఈ తరహా మోసాలు 2021-22లో 1.4శాతం ఉండగా 2025-26లో 2.5 శాతానికి పెరిగాయి.