ఏఐ హైరింగ్ జోరు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:02 AM
దేశీయ ఐటీ సేవల రంగంలో నియామకాల వేగం మందగించినప్పటికీ, కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాలకు డిమాండ్ మాత్రం వేగంగా పెరుగుతోంది.
మొత్తం ఐటీ నియామకాల్లో 3 శాతం తగ్గుదల
16 శాతం పెరిగిన ఏఐ రిక్రూట్‌మెంట్: నౌకరీ
బెంగళూరు: దేశీయ ఐటీ సేవల రంగంలో నియామకాల వేగం మందగించినప్పటికీ, కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాలకు డిమాండ్ మాత్రం వేగంగా పెరుగుతోంది. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తమ వ్యాపార నమునాలను పునర్‌వ్యవస్థీకరిస్తుండటంతో ఏఐ నిపుణుల భర్తీకి కంపెనీలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు నౌకరీ.కామ్ తన తాజా జాబ్‌సీక్ నివేదికలో వెల్లడించింది. జూన్ నెలలో ఐటీ రంగంలో మొత్తం నియమాకాలు వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గగా, ఏఐ సంబంధిత నియామకాలు 16 శాతం పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా కంపెనీల ఉద్యోగ ప్రకటనల ఆధారంగా నౌకరీ.కామ్ ఈ నివేదికను రూపొందించింది. కాగా ఏఐ ఇప్పుడు అదనపు నైపుణ్యం మాత్రమే కాకుండా సంస్థలకు కీలక సామర్థ్యంగా మారుతుండటంతో భవిష్యత్‌లో ఈ ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు కలిగిన సిబ్బందికి డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని ఇన్ఫో ఎడ్జ్ (నౌకరీ మాతృ సంస్థ) సీఈఓ హితేష్ ఒబెరాయ్ తెలిపారు. దీర్ఘకాలంలో ఐటీ రంగంలో నియామకాలు మరింత మందగించే అవకాశముందని దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేర్కొంది. సంస్థల్లో సంప్రదాయ ఉద్యోగుల సంఖ్య, ఏఐ ఏజెంట్ల సంఖ్య దాదాపు సమాన స్థాయిని చేరుకునే దిశగా పరిశ్రమ కదులుతోందని టీసీఎస్ అభిప్రాయపడింది.
ఏఐ డేటా సెంటర్లతో ఇంజనీర్లకు భారీ డిమాండ్: ఏఐ డేటా సెంటర్లు ఇతర మౌలిక వసతుల నిర్మాణం వేగం పుంజుకోవడంతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వంటి కోర్ విభాగాలకూ భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, కూలింగ్ టెక్నాలజీ, థర్మల్ మేనేజ్‌మేంట్, డేటా సెంటర్ నిర్మాణ రూపకల్పనలో నైపుణ్యం కలిన ఇంజనీర్లను కంపెనీలు పెద్దఎత్తున నియమించుకుంటుండంతో ఈ విభాగాల్లో వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే, ఏఐ రంగంలో ఉద్యోగ అవకాశాలు కేవలం సాప్ట్‌వేర్ ఇంజనీర్లకే పరిమితంకాకుండా విద్యుత్, శీతలీకరణ, పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాలకు కూడా విస్తరిస్తున్నాయి. దేశంలో డేటా సెంటర్ల నిర్వహణ సామర్థ్యం 2025లో 1.6 గిగావాట్లు ఉండగా, ఇది 2030 నాటికి 5 గిగావాట్లకు పెరగనుందని అంచనా.