అడోబ్ సారథ్యానికి శంతను గుడ్‌బై
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:09 AM
అమెరికన్ టెక్ కంపెనీ అడోబ్‌కు 18 ఏళ్లుగా సారథ్యం వహిస్తున్న హైదరాబాదీ శంతను నారాయణ్.. కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ కంపెనీ అడోబ్‌కు 18 ఏళ్లుగా సారథ్యం వహిస్తున్న హైదరాబాదీ శంతను నారాయణ్.. కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. సంస్థ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, ఇప్పుడే కాదు. కంపెనీ బోర్డు కొత్త సీఈఓను ఎంపిక చేసే వరకు ఆయనే సారథిగా కొనసాగుతారు. శంతను స్థానాన్ని భర్తీ చేయగలిగే వ్యక్తిని ఎంపిక చేసేందుకు కంపెనీ బోర్డు.. స్వతంత్ర డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోనీ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నియామక ప్రక్రియకు కొన్ని నెల లు పట్టే అవకాశం ఉంది. నూతన సీఈఓ పగ్గాలు చేపట్టాక శంతను బోర్డు చైర్మన్‌గా కొనసాగుతారు. 1998లో అడోబ్‌లో చేరిన శంతను.. 2007లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో కంపెనీలో దాదాపు 3,000 మంది ఉద్యోగులు పనిచేసేవారు. వార్షికాదాయం కూడా 100 కోట్ల డాలర్ల లోపే. శంతను సారథ్యంలో అడోబ్ సంప్రదాయ సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ కంపెనీ నుంచి సబ్‌స్ర్కిప్షన్ ఫస్ట్ మోడల్- క్రియేటివ్ క్లౌడ్ కంపెనీగా ఎదిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీ్‌స (ఎ్‌సఏఏఎస్) కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం అడోబ్‌లో 30,000 మందికి పైగా పనిచేస్తున్నారు. వార్షికాదాయం 2,500 కోట్ల డాలర్ల పైమాటే. గడిచిన 18 ఏళ్లలో కంపెనీ షేరు ధర 6 రెట్లకు పైగా పెరిగింది.
హెపీఎస్, ఉస్మానియా విద్యార్థి: తెలుగు హిందూ కుటుంబంలో 1963 మే 27న జన్మించిన శంతను.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎ్‌స)లో చదువుకున్నారు. హెచ్‌పీఎ్‌సలోనే చదివిన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్లకు సీనియర్ కూడా. పాఠశాల విద్యాభ్యాసం అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. బోలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకున్నారు. 1986లో మీజరెక్స్ ఆటోమేషన్ సిస్టమ్స్‌తో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన శంతను.. ఆ తర్వాత ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌లో ప్రొడక్ట్ డెవల్‌పమెంట్ విభాగంలోనూ పనిచేశారు. అనంతరం సిలికాన్ గ్రాఫిక్స్‌లో చేరారు. ఆ తర్వాత పికా్ట్ర పేరుతో డిజిటల్ ఫొటో షేరింగ్ స్టార్ట్‌పను స్థాపించారు.