Share News

భారత్‌లో లేఆఫ్స్ ప్రకటించిన అడిడాస్

ABN , Publish Date - Sep 16 , 2026 | 10:28 PM

ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ భారత్‌లో లేఆఫ్స్ ప్రకటించింది. గురుగ్రామ్‌లోని సంస్థ టెక్ హబ్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.

భారత్‌లో లేఆఫ్స్ ప్రకటించిన అడిడాస్
Adidas Layoffs

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ భారత్‌లో లేఆఫ్స్ ప్రకటించింది. గురుగ్రామ్‌లోని సంస్థ టెక్ హబ్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. గురుగ్రామ్ కేంద్రంలోని పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఎంతమందిని తొలగించనున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇది ఒక క్లిష్టమైన నిర్ణయమని పేర్కొంది. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్ మోడల్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా లేఆఫ్స్ చేపడుతున్నట్టు ప్రకటించింది. అడిడాస్‌ అభివృద్ధి ఇంతకాలం భాగమైనందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు కూడా తెలిపింది. సాంకేతికతలో మార్పులు వస్తున్న నేపథ్యంలో సంస్థలో కార్యకలాపాలను సరళీకరించేందుకు, దీర్ఘకాలిక విజయానికి అనువుగా సంస్థను నిలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, సుమారు 350 మంది ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురయ్యే అవకాశం ఉంది. గురుగ్రామ్ హబ్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 45-50 శాతమని సమాచారం. లేఆఫ్స్‌ గురించి అడిడాస్ సెప్టెంబర్ 15నే ఉద్యోగులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులకు అదే రోజున ఎగ్జిట్ లెటర్స్ అందాయని సమాచారం. మిగిలిన వారిని డిసెంబర్ 15 వరకూ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తమ బాధ్యతలను ఇతర సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుంది. వీరిలో కొందరిని ఇతర శాఖలకు బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అవకాశం లేని వారు మాత్రం డిసెంబర్ 15న సంస్థను వీడాల్సి ఉంటుంది. అయితే, ఉద్యోగాలు కోల్పోనున్న వారికి ఇచ్చే సెవరెన్స్ ప్యాకేజీ, నోటీస్ పే సంబంధిత వివరాలు ఇంకా తెలియరాలేదు. అడిడాస్‌కు ఉన్న గ్లోబల్ ఇంజినీరింగ్ టెక్ హబ్స్‌లో ఒకటి గురుగ్రామ్‌ కేంద్రంలో ఉంది. అక్కడ స్థానిక మార్కెటింగ్ విభాగం కూడా ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

యూపీఐ చెల్లింపులపై చార్జీలు.. ఎవరిపై భారం పడనుంది? పూర్తి వివరాలివే..

Updated Date - Sep 16 , 2026 | 10:35 PM