విమానాల తయారీలోకి అదానీ గ్రూప్
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:58 AM
అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా వాణిజ్య విమానాల తయారీకి సిద్ధమవుతోంది.
బ్రెజిల్ కంపెనీ ‘ఎంబ్రాయర్’తో జట్టు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా వాణిజ్య విమానాల తయారీకి సిద్ధమవుతోంది. ఇందుకోసం బ్రెజిల్ కేంద్రంగా పనిచేసే విమానాల తయారీ కంపెనీ ‘ఎంబ్రాయర్’తో జట్టు కడుతోంది. ఈ నెల 27న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో రెండు కంపెనీల ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందం కింద ఎంబ్రాయర్ కంపెనీకి చెందిన వాణిజ్య విమానాల తుది అసెంబ్లింగ్ లైన్ (ఎఫ్‌ఏఎల్) కోసం ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇది జాయింట్ వెంచరా లేక పూర్తిగా అదానీ నిర్వహణలో ఉండే ప్రాజెక్టా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఎందుకంటే ?
మన దేశంలో పౌర విమానయానం వేగంగా పుంజుకుంటోంది. ఇండిగో, ఆకాశ ఎయిర్‌లైన్స్‌తో పాటు టాటాల నిర్వహణలోని ఎయిర్ ఇండియా ఇప్పటికే 1,200కుపైగా కొత్త విమానాల కోసం ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టాయి. ప్రాంతీయ విమానయానం కోసం వచ్చే 20 ఏళ్లలో దేశీయ విమానయాన సంస్థలు మరో 500 విమానాల వరకు ఆర్డర్ పెట్టనున్నాయి. అదానీ గ్రూప్ ఇప్పటికే విమానాశ్రయాల నిర్వహణలో ఉంది. పెరుగుతున్న ఈ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ముందుగా విమానాల అసెంబ్లింగ్, తరువాత వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిలోకి ప్రవేశించాలని అదానీ గ్రూప్ భావిస్తున్నట్టు సమాచారం.