Adani Group Enters Aircraft Manufacturing: విమానాల తయారీలోకి అదానీ
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:56 AM
దేశంలో రెండో అతిపెద్ద ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ విమానాల తయారీ విభాగంలోకి ప్రవేశించబోతోంది.
రీజినల్ జెట్లఎఫ్‌ఏఎల్ ఏర్పాటుకు ఒప్పందం
విమాన రంగంలో మేకిన్ ఇండియాకు ఊతం
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ విమానాల తయారీ విభాగంలోకి ప్రవేశించబోతోంది. ఇందుకోసం బ్రెజిల్ ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయర్‌తో జట్టు కట్టింది. భారత్‌లో తన రీజినల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎ్‌ఫఏఎల్)ను ఏర్పాటు చేసేందుకు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పే్‌సతో ఎంబ్రాయర్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానయాన రంగంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ ఒప్పందం ఊతమివ్వనుందని వారన్నారు. 70 నుంచి 146 సీట్ల వరకు సామర్థ్యంతో కూడిన ఎంబ్రాయర్ రీజినల్ జెట్ విమానాలు స్వల్ప, మధ్య స్థాయి దూర మార్గాల్లో ప్రయాణించేందుకు పనికొస్తాయి.
భారత్‌లో తొలి యూనిట్..
ఫైనల్ అసెంబ్లీ యూనిట్‌లో విడిభాగాలన్నింటినీ కూర్చి పూర్తి విమానాన్ని తయారు చేస్తారు. ఫిక్స్‌డ్ వింగ్ ప్యాసింజర్ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి, నిర్వహణ, విమానాల ఎంఆర్‌ఓ (నిర్వహణ, మరమ్మతు, సర్వీసింగ్), పైలట్ల శిక్షణ విభాగాల్లోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ తాజాగా ఈ ఒప్పందంతో విమానాల తయారీలోకీ అడుగుపెట్టినట్లవుతుంది.
ఇండియాపై ఎంబ్రాయర్ ఫోకస్
భారత విమానయాన మార్కెట్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంబ్రాయర్ గత ఏడాది అక్టోబరులోనే ఢిల్లీలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీకి చెందిన ఈ-జెట్ విమానాలు 2005లోనే భారత్‌లోకి ప్రవేశించాయి. దాదాపు 50 విమానాలు భారత వైమానిక దళం, ప్రభుత్వ ఏజెన్సీలు, బిజినెస్ జెట్ ఆపరేటర్లతోపాటు స్టార్ ఎయిర్‌కు సేవలందిస్తున్నాయి.
ఏవియేషన్ షోలో ఒప్పంద వివరాల వెల్లడి..?
ఈ ప్రతిపాదిత ఎఫ్‌ఏఎల్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు..? పెట్టుబడులెంత..? ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుంది..? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరువర్గాలు నిరాకరించాయి. అయితే, ఈ నెలాఖరున హైదరాబాద్‌లో జరగనున్న ఏవియేషన్ షోలో ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.